Oct 19,2023 00:42
బీమా నగదు అందజేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌

ప్రజాశక్తి-కనిగిరి: వైఎస్సార్‌ బీమా పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌ అన్నారు. కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు మాచవరంలో నివసించే గాయం వెంకటరెడ్డి అనారోగ్యం లివర్‌ సమస్యతో బాధపడుతూ మరణించగా వైఎస్సార్‌ బీమాకు అర్హులైనందున నామిని అయిన భార్య శివమ్మకు బుధవారం కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, వార్డు కౌన్సిలర్‌ పోతిరెడ్డి రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా రూ.10,000ను మట్టి ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువకు ఉన్న వారందరికీ వర్తించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కుటుంబ పెద్ద సహజ మరణం పొందినా లేదా ప్రమాదవశాత్తు మరణించిన వైఎస్‌ఆర్‌ బీమా పథకం అందేలా వైఎస్‌ఆర్‌ బీమా పథకం ప్రవేశ పెట్టారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు క్లైమ్‌ మొత్తం రూ.90,000/- నామిని ఖాతాకు త్వరలో జమ చేస్తామని, అందుకు అవసరమైన పత్రాలను సంబంధిత సచివాలయంలో అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్‌ పోతిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శి ఎం వెంకట నారాయణ, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.