పేదల సంతోషమే ప్రభుత్వం లక్ష్యం
- ప్రతి నిరుపేదకూ జగనన్న ఇళ్లు : కలెక్టర్
- 3,006 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ప్రతి నిరుపేదకూ ఇళ్లు ఇవ్వాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ అన్నారు. పేదలందరికీ జగనన్న ఇళ్లు నవరత్నాలలో భాగంగా మంగళవారం నంద్యాల పట్టణంలోని ఎస్‌ఆర్బీసీ కాలనీలోని టిడ్కో గృహల వెనుక భాగంలో కుందూనది దగ్గర కేటాయించిన ఇళ్లను నిరుపేదలకు కేటాయించారు. ఈ సందర్భంగా 3,006 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎస్.మాబున్నిసా, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా అయ్యాక మొట్టమొదటి సారిగా ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలకు అనేక అడ్డంకులు ఉన్నా జిల్లా యంత్రాంగం అన్నింటినీ క్లియర్ చేసి పేదలకు ఇళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ భూమి తక్కువగా ఉందని, ఉన్న వాటిలోనే ప్రతిఒక్కరికి ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇళ్ల పంపిణిలో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా లాటరీ పద్దతిలో మీడియా సమక్షంలో అధికార యంత్రాంగం కేటాయించినట్లు చెప్పారు. ఈ కాలనీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్క్, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రానికి అవసరమైన స్థలంను రిజర్వ్ చేసి పెట్టామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, తక్షణమే ఇళ్లు నిర్మించుకోవాలని హౌసింగ్ ద్వారా రూ.1.80 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. పొదుపు గ్రూప్ సభ్యులైతే మెప్మా, డిఆర్‌డిఏ, సెల్ప్ హెల్ప్ గ్రూప్‌ల ద్వారా రూ.35 వేలు ఇస్తామని, ప్రతి ఒక్కరూ ఇళ్లు కట్టుకోవాలని కోరారు. లేకుంటే ఉన్న స్థలాలు కూడా ఆక్రమణకు గురవుతాయని తెలిపారు. అనంతరర ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి హయాంలో పేదలకు ఇళ్ల కేటాయింపులు రియల్ ఎస్టేట్ చేస్తే వైసిపి ప్రభుత్వం ఒక రూపాయికే ఇల్లు కేటాయించి పట్టాలు అందజేస్తుందని తెలిపారు. పట్టణంలో మూడు వేల ఆరు మంది లబ్ధిదారులకు లే ఔట్ వేసి ఇల్లు కేటాయించామన్నారు. ఎంపీ మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని శిల్పా కుటుంబం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనర్ రవి చంద్రారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ వెంకట్ దాస్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, సచివాలయాల సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.










