పేదల ప్రభుత్వంపై తోడేళ్లన్నీ ఒకటవుతున్నాయి
పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు
175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని టిడిపి, జనసేనకు సవాల్
తిరువూరులో జగనన్న విద్యాదీవెన సభలో సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి, తిరువూరు
పేదలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై దుష్టచతుష్టయంలో ఉన్న తోడేళ్లన్నీ ఏకమై ముప్పేట దాడికి తయారవుతున్నాయనీ, ఇవన్నీ కలిసినా తననేమీ చేయలేవని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కోసం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆదివారం నాడు నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. రూ. 698.68 కోట్ల నిధులను 8,83,723 మంది తల్లుల ఖాతాల్లోకి నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు. ఈ నిధుల విడుదలతో 9,86,001 మంది విద్యార్థుల లబ్ధి పొందినట్లు సీఎం జగన్ సభలో వివిరించారు. విలువలు లేని దుష్టచతుష్టయంతో యుద్ధం చేస్తున్నామన్నారు. రాజకీయాల్లో కనీస అర్హత లేని వాళ్లు కూడా ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకీ తోడేళ్లంతా ఏకమవుతున్నారో, రాష్ట్రాన్ని దోచుకు తినడానికి పొత్తుల కోసం వీళ్లంతా వెంపర్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. పేదల కోసం పనిచేస్తున్నా మీ బిడ్డ జగనన్నకు నమ్మకం, ధైర్యం, అండ అన్నీ ప్రజలేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్లో మీడియా, కుట్ర రాజకీయాలతో తాను భయపడేది లేదన్నారు. రాజకీయాల్లో టీడీపీలా కుట్రలు చేయడం లేదని, ప్రజా సేవ చేస్తున్నామని వివరించారు. ఇదే బడ్జెట్ ఉన్న టీడీపీ హయాంలో చంద్రబాబు పేదలకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించారు. అప్పటి బడ్జెట్ నిధులన్నీ నీరు చెట్టు, జన్మభూమి కమిటీల పేరుతో పెత్తందారులు దోచుకుతిన్నారని విమర్శించారు. కానీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టామని సీఎం జగన్ తెలిపారు. గత 45నెలలుగా విద్యా వ్యవస్థలో జరుగుతున్న అభివృద్ధిని, మార్పును గమనించాలని కోరారు. జీవన ప్రమాణాలు పెరగాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాదిరిగా పేదరికాన్ని జయించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటోందనానరు. గత ప్రభుత్వ హయాంలో వందల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టిందన్నారు. దీంతో వేలాది మంది పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చివరికి సర్టిఫికెట్లు కూడా చేతికి రాని దుస్థితి నెలకొందన్నారు. విద్యార్థులు ఇలా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ప్రతి మూడు నెలలకు ఒక పర్యాయం విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్ తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 27 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ. 9947 కోట్లు చెల్లించామన్నారు. 2017 నుంచి 2019 వరకు టిడిపి హయాంలోని రూ. 1777 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించామన్నారు. పిల్లల ఎలా చదువుతున్నారు, విద్యా సంస్థల్లో చదువులు ఎలా చెబుతున్నారు, వసతులు ఎలా ఉన్నాయి తదితర అంశాల పట్ల బాధ్యత పెంచాలనే ఉద్దేశంతోనే తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. కళాశాలల్లో సమస్యలుంటే 1092కి నేరుగా ఫోన్ చేస్తే వాటిని ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ప్రపంచంతో పిల్లలు పోటీ పడాలన్నారు. సత్యనాదెళ్ల మాదిరిగా ఎదగాలని ఆకాంక్షించారు. 2018-19లో 87400 మంది ఇంజనీరింగ్‌లో వంటి కోర్సుల్లో చేరితే ప్రభుత్వం చేపట్టిన విద్యా, వసతి దీవెనల వల్ల ఆ సంఖ్య 1.25వేలకు పెరిగిందన్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాల పొందే వారి సంఖ్య కూడా పెరిగిందన్నారు. వచ్చే ఏడాది నుంచి నాడు-నేడు పూర్తయిన పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటుచేస్తామన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నామన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తామన్నారు. ప్రయివేటు పాఠశాలలకు స్పూర్తిగా ప్రభుత్వ బడులను మారుస్తామన్నారు. ఉన్నత విద్యను కూడా మంచి ప్రమాణాలతో మార్పులు చేస్తున్నామన్నారు. జాబ్ ఓరియంటెడ్ కోర్సులను కరిక్యులమ్‌లను మారుస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కొత్తగా 14 డిగ్రీ కళాశాలలను తెచ్చామన్నారు. పులివెందులలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యకు సంబంధించి ఇంత మంచి మార్పు చేస్తోంటే ఎలాంటి కుటుంబ విలువలు లేని, రాజకీయ నీతి లేని, మానవత్వం లేని దుష్ట చతుష్టీయం ఓర్చుకోలేక పోతోందన్నారు. ఇది వరకు దోచుకో, పంచుకో, తినుకో(డిపిటి) పద్ధతిలో పరిపాలన సాగితే వైసిపి హయాంలో నేరుగా డిబిటి ద్వారా లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం మంచి చేయకపోతే టిడిపి, జనసేనలు ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. 175 స్థానాలలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. మంచి చేసిన వారికే చివరి గెలుపు ఉంటుందన్నారు. సినిమాలో విలన్లు ప్రజలు నచ్చరని హీరోలను మాత్రమే నచ్చుతారన్నారు. ఈ సందర్భంగా తిరువూరు నియోజక వర్గానికి వరాల జల్లు కురిపించారు. కట్లెరు వంతెన నిర్మాణానికి రూ. 26 కోట్లు, ఏకొండూరుకు కృష్ణా నీటి సరఫరా కోసం రూ. 50 కోట్లు, అదనంగా ఆరు వేల ఇళ్లు, రోడ్ల మరమ్మతుల నిమిత్తం రూ. 10 కోట్లు, తిరువూరులో డ్రైనేజీ పరిష్కారం కోసం రూ. 4 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. అనంతరం బటన్ నొక్కి విద్యా దీవెన సొమ్మును తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, మేరుగ నాగార్జున, కలెక్టర్ ఢిల్లీరావు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










