ప్రజాశక్తి - మంత్రాలయం
రాష్ట్రంలో పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, టిటిడి పాలక మండలి సభ్యులు వై.సీతారామిరెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు సేవలను అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందని చెప్పారు. మంగళవారం మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచి ముక్కరన్న, వైసిపి నాయకులు, మాజీ ఎంపిటిసి రఘునాథ్ రెడ్డి, వైసిపి నాయకులు మంగళ వాయిధ్యాలతో పూలమాలలు వేసి స్వాగతం పలికారు. శిలాఫలకాన్ని ప్రారంభించి రిబ్బన్ కట్ చేసి సచివాలయాన్ని ప్రారంభించారు. 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో పాల్గొని గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామానికి ఆదోని, మాధవరం ప్రధాన రహదారి నుంచి రూ.50 లక్షలతో తారు రోడ్డు, రూ.20 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాలు, రూ.65 లక్షలతో సిసి రోడ్లు, డ్రెయినేజీ, రూ.55 లక్షలతో తాగునీటి సౌకర్యం, రూ.5 లక్షలతో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేశామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టిడిపి నాయకులు మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి వస్తారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. పేదల విద్యకు పెద్ద పీట వేయడమే కాకుండా కార్పొరేట్ తరహాలో విద్య, వైద్యం అందించడం జగనన్నకే సాధ్యమైందని కొనియాడారు. పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఎమ్మెల్యే, సీతారామిరెడ్డికి గజమాలతో సన్మానం చేశారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి, యువ నాయకులు దశరథ రెడ్డి, ఎస్‌ఐ కిరణ్, ఎంపిడిఒ మణిమంజరి, ఇఒఆర్‌డి ప్రభావతి, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి, ఎపిఒ తిమ్మారెడ్డి, ఎపిఎం జయశ్రీ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ వేద స్వరూప, పిఆర్ డిఇ అశ్వత్థామ, జెఇ నరసింహులు, ఎంపిటిసి విశాలక్ష్మి పాల్గొన్నారు.
స్వాగతం పలుకుతున్న నాయకులు










