Aug 22,2023 20:04

విద్యార్థులను కెజిబివిలో చేర్పిస్తున్న అధికారులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
పేద విద్యార్థులు ఉన్నత చదువుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎంపిడిఒ గీతావాణి చేయూతనందించారు. మండలంలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన రేణుక, కవిత పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. ఉన్నత చదువులకు వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులతో సతమవుతమవుతూ వారి అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. ఎంపిడిఒ గీతవాణిని కలిశారు. వారి ఆర్థిక స్తోమతను ఎంపిడిఒ గీతావాణికి వివరించారు. ఎలాగైనా ఉన్నత చదువులకు కెజిబివిలో సీట్లు ఇప్పించాలని కోరారు. ఆలస్యం చేయకుండా ఎంఇఒలు శివరాములు, శ్రీనివాసులకు సమాచారం అందించారు. ఎలాగైనా కెజిబివిలో విద్యార్థులకు సీట్లు వచ్చేలా చూడాలని ఎంపిడిఒ గీతావాణి సూచించారు. మంగళవారం ఎంపిడిఒ గీతావాణి, ఎంఇఒలు శివరాములు, శ్రీనివాసులు, సిఆర్‌పి హుసేనప్ప కెజిబివిలో చేర్పించారు. అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ 'గడపగడపకు'లో అదే గ్రామానికి చెందిన విద్యార్థిని చదువుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఇంట్లో వారు సహకరించడం లేదని ఎంపిడిఒ గీతావాణికి తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పరి కెజిబివిలో సీటు ఇప్పించడమే కాకుండా, దగ్గరుండి కలెక్టర్‌ సృజన కూడా ఆ విద్యార్థి చదువుకు భరోసా కల్పించారు. మండల స్థాయి అధికారులు తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, ఎంపిడిఒ గీతావాణి, అప్పటి ఇస్వి ఎస్‌ఐ విజయలక్ష్మి ఆ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేవారు.