Sep 23,2023 21:49

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

     అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ బాధ్యులుగానున్న విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ అంశాలపై పట్టు బిగిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని మార్పులను ఇప్పటికే చేశారుకూడా. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరిన్ని మార్పులు తీసుకొచ్చే దిశగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కోక్కటికీ సరిదిద్దే చర్యలు చేపట్టారు. ప్రారంభంలో ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టారు. ఈ సమీక్షల్లో నేతలతో ముఖాముఖిగా చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో నేతల పనితీరుపైనా ఆరా తీశారు. ఈ సందర్భంగా పార్టీ విజయానికి అందరూ కట్టుబడి పని చేయాల్సిందేనని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవన్న హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం కొంత మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఆ తరువాతి క్రమంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటి హిందూపురం నియోజకవర్గంలో ఇన్‌ఛార్జీని మార్చారు. 2019 ఎన్నికల నుంచి ఇన్‌ఛార్జిగా ఉన్న మహమ్మద్‌ ఇక్బాల్‌ను అక్కడి నుంచి తప్పించారు. దీపికాను నియజకవర్గ ఇన్‌ఛార్జీగా నియమించారు. ఆమెకు నాయకుల మధ్య కూడా కొంత తేడాలొచ్చాయి. వీటిని సరిదిద్దేందుకు నేరుగా ఆయనే రంగంలోకి దిగి అసమ్మతినేతలతో మాట్లాడి సర్దుబాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. టిడిపి ఆవిర్భావం నుంచి కంచుకోటగానున్న హిందూపురంలో వచ్చే ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఆ తురువాతి వంతుగా కదిరి నియోజకవర్గంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా సిద్ధారెడ్డి ఉన్నారు. ఈసారి ఆయన కాకుండా మైనార్టీ అభ్యర్థిని అక్కడి నుంచి బరిలో దింపే ఆలోచనలోనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఇస్మాయల్‌, మక్బుల్‌ అన్న పేర్లు వినిపిస్తున్నాయి. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కూడా ఉండటంతో ఇప్పటికిప్పుడు ప్రకటించకపోవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో సత్యసాయి జిల్లాలోనూ, అనంతపురం జిల్లాలోనూ కొత్త వారికై రెండు, మూడు పేర్లను పరిశీలనలో పెట్టుకుని సర్వే టీమ్‌ల ద్వారానూ ఆరా తీసే పనిలోనున్నట్టు తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆయనతో నేరుగా కలసి తమతమ విజ్ఞాపనలను తెలిస్తుండటంతో నియోజకవర్గ నేతల్లో కొందరికి గుబులు రేపుతోంది. ఆయన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయోనన్న ఆందోళన సైతం నెలకొంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నేతలకు అభ్యంతరాలున్నప్పటికీ ఆయన ద్వారా కొన్ని పనులు జరిగిపోతుండటం చూసి విస్మయంలోనూ ఉన్నారు. తాము కాదన్న వాటిని కూడా ఆయన చేయించేస్తే తమ పరిస్థితి ఏమిటన్న అసంతృప్తిని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే అధిష్టానం వద్ద ఆయనుకున్న పలుకుబడిని చూసి బాహాటంగా చెప్పలేక మౌనంగా ఉండిపోతుండటం గమనార్హం. ఏది ఏమైన వచ్చే ఎన్నికల సమయానికి ఆయన ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాలపై పూర్తి స్థాయి పట్టుబిగించే సూచనలు కనిపిస్తున్నాయి.