Aug 23,2023 22:52

కరెంట్‌ కట్‌..

       అనంతపురం ప్రతినిధి : 'జిల్లాలోనున్న 2,09,325 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు రూ.979 కోట్లు ఖర్చు చేసి లో ఓల్టేజీ నుంచి హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టంకు మార్చాం..' అంటూ అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగస్టు 15వ తేదీన అనంతపురం నగరంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల ప్రసంగంలో చెప్పారు. ఆచరణలో చూస్తే వ్యవసాయానికి తొమ్మిది గంటలు కాదు...గదా ఆరు గంటలు కూడా సక్రమంగా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియక రైతులు పొలాల్లోనే రాత్రీ,పగలు పడిగాపులు కాసే పరిస్థితులు నెలకొన్నాయి.
ఎండుతున్న పంటలు
       అనంతపురం రూరల్‌ మండలం పరిధిలోని మన్నీల గ్రామంలో మొత్తం వ్యవసాయ భూమి 3500 ఎకరాలుంది. ఇందులో సుమారు రెండు వేల ఎకరాల్లో బోరు బావుల కిందనే పంటలు సాగవుతాయి. వ్యవసాయ మోటర్లతోనే ఉద్యానవన పంటలతోపాటు వేరుశనగ వంటి పంటలు సాగవుతున్నాయి. ఈ గ్రామంలో మూడు రోజులుగా సక్రమంగా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీనిపై రైతులు బుధవారం నాడు సబ్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన సైతం చేపట్టారు. విద్యుత్‌ అధికారులు విద్యుత్‌ సరఫరాలో అంతరాయంపై సరైన సమాచారం సైతం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇది ఒక్క మన్నీల గ్రామం పరిస్థితితే కాదు. జిల్లాలోని అనేక గ్రామాల్లోనూ ఇదే విధంగా ఉంది. ఒకవైపు వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉన్న పంటనైనా రక్షించకుందామంటే కరెంటు సమసమస్య తీవ్రంగా ఉంది.
పది ఎకరాల్లో వేరుశనగ ఎండిపోతోంది
ఓబులయ్య, రైతు, మన్నీల గ్రామం.

          పది ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేశాం. మూడు లక్షలు రూపాయలు పెట్టుబడి పెట్టాను. ఒకవైపు వర్షాల్లేక సమస్యగా ఉంది. మరో వైపు పంట ఎండిపోకుండా కాపాడుకుందామంటే బోరు బావుల్లో నీరున్నా పంట పెట్టుకోవడానికి వీల్లేకుండా కరెంటు ఉండటం లేదు. ఎప్పుడు వస్తుందో కూడా తెలియక పొలాల్లోనే రాత్రీపగలు పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. మంచి ఊడలు దిగే సమయంలో నీళ్లు లేక పోతే పంట దిగుబడి ఏ మాత్రం అందదు.
వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలి
రామాంజినేయులు, జిల్లా నాయకులు ఎపి రైతు సంఘం.

        వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందివ్వాలి. ఏ సమయంలో విద్యుత్‌ సరఫరా అందిస్తామన్నది ముందుగానే సమాచారం అందివ్వాలి. దీంతో రైతులు ఆ సమయానికి రైతులు పొలాలోకెళ్లి పంటకు నీళ్లు పెట్టుకునే పరిస్థితి నెలకొంది.