Jul 21,2023 21:24

వ్యవసాయం

       అనంతపురం ప్రతినిధి : తుపాను ప్రభావంతో అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం ఇప్పటికీ పదునవలేదు. సగానికిపైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితులే కొనసాగుతున్నాయి. గతేడాది ఇదే సమయానికి జిల్లాలో మంచి వర్షాలే నమోదయ్యాయి. ఈసారి జూన్‌ ప్రారంభం నుంచి వర్షభావ పరిస్థితులే ఉంటూ వస్తున్నాయి. ఇప్పటికీ రైతులు వర్షం కోసం ఆకాశం వైపు చూడక తప్పడం లేదు. చాలా మండలాల్లో ఖరీఫ్‌ పంట విత్తనాలు వేయని పరిస్థితి నెలకొంది.
40 మండలాల్లో వర్షాభావం
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 63 మండలాలుంటే 40 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా 31 మండలాలుంటే 20 మండలాల్లో వర్షాభవం ఉంది. శెట్టూరులో అత్యధికంగా 60 శాతం వర్షపాతం లోటుంది. సాధారణ వర్షపాతం ఈ మండలం పరిధిలో 79 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 31.1 మిల్లీమీటర్లు నమోదయ్యింది. ఇవే కాకుండా కళ్యాణదుర్గం, యాడికి, వజ్రకరూరు మండలాల్లో 50 శాతానికిపైగా వర్షపాతం లోటుంది. గతేడాది ఇదే సమయానికి సాధారణ వర్షపాతం నమోదయ్యింది. గతేడాది జూన్‌ నెలలో అనంతపురం జిల్లాలో 61.5 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం అయితే 82.5 మిల్లీమీటర్లు సాధారణం కంటే ఎక్కువగా పడింది. కాని ఈ నెల ఇప్పటికి 45.8 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యింది. ఇక జులై నెలలో 42.7 మిల్లీమీటర్లకుగానూ 21 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. గతేడాది ఇదే సమయానికి 29.9 మిల్లీమీటర్లు నమోదయింది. సత్యసాయి జిల్లాలో 32 మండలాలకుగానూ 20 మండలాల్లో వర్షాభావం నెలకొంది. అందులో ఎనిమిది మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. 12 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం
వర్షాభావ పరిస్థితుల ప్రభావం ఖరీఫ్‌ సాగుపై పడింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాధారణ సాగు 16 లక్షల ఎకరాలయితే ఇప్పటి వరకు సాగైంది కేవలం 2.63 లక్షల ఎకరాల్లోనే అంటే సాదారణ సాగులో 16 శాతం మాత్రమే విత్తనం పడింది. అందులో అనంతపురం జిల్లాలో 1.59 లక్షల ఎకరాలయితే, సత్యసాయి జిల్లాలో 1.04 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రధాన పంట అయిన వేరుశనగ అనంతపురం జిల్లాలో 60 వేల ఎకరాల్లో వేరుశనగ సాగవగా, సత్యసాయి జిల్లాలో 86 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇక వేరుశనగ విత్తుకునేందుకు అవనువైన సమయం దాటిపోతోంది. జులై 15వ తేదీ వరకు సరైన సమయంగా రైతులు భావిస్తారు. ఆపైనా వేసినా దిగుబడి సరిగా రాదన్న రైతులు భావిస్తుంటారు. అయితే వ్యవసాయ శాస్త్రవేత్తలు మాత్రం ఆగస్టు మొదటి వారం వరకు విత్తుకునేందుకు అనువైన సమయమని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమే వర్షాభావం కారణంగా రైతులు సకాలంలో విత్తనం విత్తుకునేందుకు అనువైన పరిస్థితులు నెలకొనలేదు.