అనంతపురం కలెక్టరేట్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా రంగ సంస్కరణల నుంచి ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకుందామని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ బైక్‌ర్యాలీని ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువారం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో యాత్ర ప్రారంభం అయ్యింది. యాత్ర హిందూపురం నుంచి పెనుకొండ, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు మీదుగా గురువారం రాత్రికి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 'ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుధ్ధరించుకుందాం' అన్న నినాదంతో జాతా కొనసాగుతోందని చెప్పారు. 1974వ సంవత్సరంలో యుటిఎఫ్ ఆవిర్భావం నుంచి విద్యారంగ సమస్యల పరిష్కారంపై అనేక పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. అప్రెంటీస్ విధానం రద్దు, కౌన్సెలింగ్ విధానాన్ని నిలబెట్టుకోవటం, నెలవారీ ప్రమోషన్లు, ఉపాధ్యాయుల హక్కులు కాపాడుకుంటూనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం యుటిఎఫ్ కషి చేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా హక్కుల్ని కాపాడుకునేందుకు పోరాటమే సరైన మార్గం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాలు ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టదాయకంగా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారంలో పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని గొప్పలు చెప్పారన్నారు. అధికారంలో వచ్చిన నాలుగేళ్ల అనంతరం జిపిఎస్ పేరుతో ఉద్యోగులకు నష్టం చేకూర్చే మరో పెన్షన్ విధానం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయలు 2024 ఎన్నికల్లో ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమస్యల పరిష్కారంపై సాగించే పోరాటంలో భవిష్యత్తులో కలిసొచ్చే సంఘాలను కలుపుకుని విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు కె.సురేష్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమం కోసం పని చేస్తూనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు యుటిఎఫ్ కృషి చేసిందన్నారు. విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు, 10వ తరగతి మోడల్ టెస్ట్ పేపర్స్ లాంటివి కూడా ప్రచురిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.కోటేశ్వరప్ప, జిల్లా అధ్యక్షులు సి.లింగమయ్య, ప్రధాన కార్యదర్శి వి.గోవిందరాజులు, గౌరవాధ్యక్షులు ఎస్‌వివి.రమణయ్య, సహాధ్యక్షులు ఆర్.రామప్ప చౌదరి, సరళ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగేంద్ర, కోశాధికారి రాఘవేంద్ర, జిల్లా కార్యదర్శులు ప్రమీల, అర్జున్, రాముడు, రాష్ట్ర కౌన్సిలర్ సూర్యనారాయణ, ఆడిట్ కమిటీ మెంబర్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.










