ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : మనిషి మనుగడకు అతిముఖ్యమైంది ఆహారం. అందులోనూ పోషకాలుంటే ఆరోగ్యం బాగుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు కొత్త రుచుల కోసం ఇష్టపడుతూ పోషకాలకు దూరమవుతున్నారు. తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పౌష్టికాహార మాసోత్సవాలను నిర్వహిస్తోంది. గర్భిణులు, బాలింతలకు పోషక విలువలున్న పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ, సుఖ ప్రసవాలకు, మాతా, శిశు మరణాల నివారణకు ప్రాధాన్యత ఇస్తుంది.
భద్రగిరి ఐసిడిఎస్ పరిధిలో....
భద్రగిరి ఐసిడిఎస్ పరిధిలో గుమ్మలక్ష్మీపురం, తాడికొండ, కేదారి పురం, రేగిడి, దుడ్డుఖల్లు సెక్టార్ల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో నెల రోజుల పాటు పోషకాహారంపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండటంతో పాటు మాతా శిశు మరణాలు నివారణకు అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. కొండపోడులో పండించే చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, ఊదలు, గంటెలు, మొక్కజొన్న పంటల ప్రాధాన్యత వివరిస్తున్నారు. ఎరువు లేని స్వచ్ఛమైన ఆహారం తినడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలియజేస్తున్నారు. చిరుధాన్యాలతో తయారు చేసిన వంటలు ప్రదర్శనగా ఉంచి చిరుధాన్యాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు పండించాలని సూచిస్తున్నారు.
గర్భిణులు తీసుకోవాల్సిన ఆహారం
గర్భిణుల ఆరోగ్యం కోసం శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
నూనె పదార్థాలు..: నూనె, నెయ్యి, డాల్డా
పోషక పదార్ధాలు : వేరుశెనగ, కందిపప్పు, మినప్పప్పు, బాదంపప్పు
మాంసకత్తులు : చేపలు, గుడ్లు, మాంసం
రక్షణ ఇచ్చే ఆహారం : తోటకూర, పాలకూర, మెంతికూర, బెండకాయ, సొరకాయ, బీరకాయ, మునక్కాయ, టమోటా, ముల్లంగి, క్యాబేజీ, క్యారెట్, కాలీఫ్లవర్, నారింజ, పనస, మామిడి, అరటి, ఆపిల్, సీతాఫలం, జామ, నిమ్మ, దానిమ్మ తదితర పోషక పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు.










