ప్రజాశక్తి - కురుపాం: ప్రజల భాగస్వామ్యం లేకుండా ఎందులోనూ పురోగతి ఉండదు.. ఒకరికొకరు కలిసి పని చేసినప్పుడే అశించిన ఫలితాలు అందుతాయి. ఇందులో భాగంగానే పాఠశాల యాజమాన్య కమిటీలు ఏర్పాటయ్యాయి. పాఠశాల అభివృద్ధిలో ప్రజలు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఇలా అందరూ సర్వశిక్ష అభియాన్ ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేసే బాధ్యతను అమలు చేస్తున్నారు. పాఠశాలల పనితీరు, అభివృద్ధి విద్యనందించేందుకు పాఠశాల తనఖీ చాలా అవసరం. ఇందులో ప్రజలు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు ఉపాధ్యాయుల బాధ్యతను పెంచడానికి తనిఖీ అవసరం. ఈ కార్యక్రమం పారదర్శ కతను పెంచుతుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి, బాలల హక్కులు పరిరక్షించడానికి ఉపయోగపడుతుంది. పాఠశాలలో ఉచిత విద్యకు ఆటంకం కలగకుండా ప్రోత్సహించడానికి సమర్ధవంతంగా నాణ్యమైన విద్యను అందించడానికి దోహదపడుతుంది.
అయితే మండలంలోని పాఠశాలల తనిఖీ నామమాత్రంగా ఉంది. ప్రతి పాఠశాలకు యాజమాన్య కమిటీ ఉన్నా అవి నిరుపయోగంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న తరుణంలో మరింతగా మెరుగుపడటానికి తనిఖీల ప్రాధా న్యత పెరిగింది. పాఠశాల అభివృద్ధికి ఎలాంటి పథకాలు ఉన్నాయి, వాటి కోసం ఎంత ఖర్చు చేశారు. ఎలా ఖర్చు పెట్టారు వంటి విషయాలను చూడాల్సి ఉంది. ఉపాధ్యాయుల నడవడిక, విద్యార్థుల పట్ల వారి ప్రవర్తన, వసతి కల్పన, మధ్యాహ్న భోజన పథకం తదితర విషయాలకు సంబం ధించి విద్యా కమిటీ చైర్మన్లు, అధికారులు తనిఖీలు నిర్వహించడం వల్ల ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది. అప్పుడ ప్పుడూ పాఠశాలలకు వెళ్లి నామమాత్రంగా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేస్తుంటారు. అయితే జిల్లా అధికారులు తనిఖీలకు వచ్చే విషయం ముందు రోజు ఉపాధ్యాయులకు చేరవేయడంతో తప్పులు జరగకుండా అధికారులు వచ్చే సమయానికి సమస్యలు లేకుండా తాత్కాలికంగా దిద్దుకుంటూ ఉంటారు. అలా కాకుండా అకస్మిక తనిఖీలు చేస్తే ఉపయోగం ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులు భవిష్యత్తుకు మంచి బాటలు వేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.










