ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రభుత్వం ఆవలంభిస్తున్న విద్యారంగ వ్యతిరేక విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోందని, దీనిని ఎదుర్కోవడం కోసం ఉపాధ్యాయులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.మంజుల, కె.భానుమూర్తి కోరారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రెండోరోజు ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యయన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యాశాఖలో వచ్చిన 117 జిఒ ద్వారా రాష్ట్రంలోని అనేక పాఠశాలలోని 3, 4, 5వ తరగతులను ఉన్నతా పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల వేలాది ఉపాధ్యాయ పోస్టులు మిగులు పడ్డాయని తెలిపారు. రెండు మాధ్యమాలకు బదులు ఒకే మాధ్యమం వల్ల కూడా వేలాది పోస్టులు మిగులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. విద్యారంగంలో నాణ్యత లోపించిందని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో 1, 2వ తరగతుల్లో విద్యార్థులు లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మూడు నెలలు గడిచినా నేటికీ ఉపాధ్యాయుల జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ పాఠశాలల తనిఖీ పేరుతో వస్తూ ప్రభుత్వ పాఠశాలల, ఉపాధ్యాయుల ప్రతిష్ట దిగజార్చే విధంగా వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం పోయి, ప్రయివేట్ పాఠశాలలకు మేలు చేకూర్చే విధంగా ఉందని తెలిపారు. ఎపిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అశోక్ కుమార్, ఎ.శ్యాంసుందర్ రెడ్డి, టి.త్రినాథ, కె.నాగ సోమేశ్వరమ్మ, కార్యదర్శులు డి.సరస్వతి, సయ్యద్ చాంద్ బాష, బి.రఘుబాబు, ఎన్.రవికుమార్, ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలాని, పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ, వరప్రసాద్, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎం.రంగన్న, ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న మంజుల










