Oct 19,2023 21:12

తిరుపతిలో యుటిఎఫ్‌ దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు

'పాత పెన్షన్‌' ఇవ్వాల్సిందే..!
'దీక్ష'బూనిన ఉపాధ్యాయులు చిత్తూరు, తిరుపతిలో నిరసనలు
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌, చిత్తూరు అర్బన్‌
పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్‌ను రద్దు చేయాలని యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో తిరుపతి, చిత్తూరు జిల్లా కేంద్రాల్లో నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. ఏ రాజకీయ పార్టీ అయితే పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తుందో ఈసారి ఆ పార్టీకే తాము ఓటు వేస్తామని చెప్పారు. ఒపిఎస్‌ పునరుద్ధరిస్తామని చెప్పిన వైసిపి నమ్మకద్రోహం చేస్తూ జిపిఎస్‌ను తీసుకొచ్చిందన్నారు. ఒపిఎస్‌ను పునరుద్ధరించేంత వరకూ తమ ఉద్యమం ఆగదని నాయకులు హెచ్చరించారు. వీరి ఆందోళనలకు సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, చిత్తూరు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు సంఘీభావం తెలిపారు. సిపిఎస్‌, జిపిఎస్‌ విధానాలను అంగీకరించబోమని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాల్సిందేనని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతి రెడ్డి, చిత్తూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సోమశేఖర్‌నాయుడు, జివి రమణ డిమాండ్‌ చేశారు. చిత్తూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరవధిక నిరాహారదీక్షను ప్రారంభించారు. యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు పాండియన్‌ దీక్షలో కూర్చున్న అందరికీ పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు.
తిరుపతిలో పెద్దకాపు లేఅవుట్‌ లోని యూటీఎఫ్‌ కార్యాలయంలో దీక్ష ప్రారంభమయ్యింది. ఈ నిరాహార దీక్షలను ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ ఎస్‌ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండు చేశారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో సిపిఎస్‌ ను రద్దుచేసి పాత పెన్షన్ను పునరుద్ధరించడం జరిగిందని, ఆ విధంగా మన రాష్ట్రంలోనూ సిపిఎస్‌ ను, జిపిఎస్‌ ను పక్కనపెట్టి ఓపిఎస్‌ ను మాత్రమే అమలు చేయాలన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు రాజశేఖర్‌, ముత్యాల రెడ్డి మాట్లాడుతూ ఓ పి ఎస్‌ సాధన కోసం ఈ రాష్ట్రంలో యుటిఎఫ్‌ సంవత్సరాల తరబడి అనేక పోరాటాలు చేసిందని, గత సంవత్సరం రోజులుగా పోరుగర్జన, సంకల్ప దీక్ష, ధర్మస్థలం లాంటి అనేక కార్యక్రమాలను చేసిందని, చివరగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పాత పెన్షన్‌ ను అమలు చేసే దిశగా నడిపించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో బుధవారం నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం జిల్లాస్థాయిలో నిరాహార దీక్షలు ప్రారంభించామని, రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేసేంతవరకు ఈ నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవరాల నిర్మల మాట్లాడుతూ 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ను కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని, దానిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం తగదని, దీనివలన ఆ కాలంలో నియమితులైన ఉపాధ్యాయులు పెద్ద మొత్తంలో నష్టపోతారని, వెంటనే కేంద్ర ప్రభుత్వం సూచనల ఆధారంగా వారికి పాత పెన్షన్‌ వర్తించేటట్లు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరాహార దీక్షలో కోశాధికారి పత్తిపాటి రమేష్‌ నాయుడు, జిల్లా కార్యదర్శులు దండు రామచంద్రయ్య, మస్తానయ్య, సుధీర్‌, మోహన్‌ బాబు, ప్రభాకర్‌, రాష్ట్ర కౌన్సిలర్లు రామమూర్తి రాజు, రమేష్‌, వాసుదేవరావు ఆడిట్‌ కమిటీ సభ్యుడు శివకుమార్‌, కార్యకర్తలు భువనేశ్వరి నాగార్జున, బాలసుబ్రహ్మణ్యం, నరేష్‌, ఖాదర్‌ భాషా సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి యుటిఎఫ్‌ కార్యాలయంలో నిరవధిక దీక్షకు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.జయచంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.మాధవకృష్ణ సంఘీభావం ప్రకటించారు. 2004 నుంచి ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం పునరుద్ధరించాలని ఆందోళన చేస్తూనే ఉన్నారని, నాలుగైదు సంవత్సరాలుగా సమరశీల పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. నివరధిక దీక్షతోనైనా రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలన్నారు. ముఖ్యమంత్రి మోసపూరిత ప్రకటనలు చేయడం బాధ్యాతారాహిత్యమన్నారు. కార్పొరేట్లకు కోట్లాది రూపాయలు కట్టబెడుతున్న ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్‌ ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నాయో బహిరంగపరచాలని డిమాండ్‌ చేశారు.
తిరుపతిలో యుటిఎఫ్‌ దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు