Sep 17,2023 21:26

మాట్లాడుతున్న కెవిపియాస్‌ జిల్లా అధ్యక్షులు దేవ సహాయం

పాత భావాలతో బానిసలుగా మార్చే ప్రయత్నం

ప్రజాశక్తి - నందవరం

మునువాద సిద్ధాంత పాత భావాలతో దళితులను బానిసలుగా మార్చేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కెవిపిఎస్‌ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కెవిపిఎస్‌ నిర్వహిస్తున్న దళిత రక్షణ యాత్రలో భాగంగా ఆదివారం నందవరం మండలంలోని మూగతి గ్రామంలో దళిత రక్షణ యాత్ర కార్యక్రమాన్ని కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు దేవ సహాయం జండా ఊపి ప్రారంభించారు. అనంతరం కెవిపిఎస్‌ మండల అధ్యక్షులు మామిడికాయల రాజు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు దేవ సహాయం, జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్‌లు మూగతి, నందవరం, మాచాపురం ,ఇబ్రహీంపురం, కొత్త నది కైరవాడి, నాగలదిన్నె గ్రామాలలో దళత రక్షణ యాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో మనువాదాన్ని ప్రామాణికంగా తీసుకున్న బిజెపి, రాష్ట్రంలో అహంకార ఆధిపత్యాన్ని ప్రామాణికంగా తీసుకున్న వైసిపి అధికారంలో ఉంటూ, దళితుల, ముస్లింల, గిరిజనుల హక్కులను సంపూర్ణంగా కాలరాస్తున్నాయన్నారు. దళితులను చైతన్యం చేస్తూ ఈనెల 22వ తేదీన నందవరం మండల కేంద్రంలో,సెప్టెంబర్‌ 29న విజయవాడలో జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, మహా ధర్నాలో వేలాది మంది పాల్గొని దళితుల సత్తా ఏంటో చాటాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం నాగలదిన్నె గ్రామంలో కెవిపిఎస్‌ నూతన జెండాను జిల్లా అధ్యక్షులు దేవ సహాయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంథోని, డప్పు కళాకారుల సంఘం నాయకులు జయరాజు, కాటికాపర్ల సంఘం నాయకులు రాజా రమేష్‌, చర్మకార వృత్తిదారుల సంఘం మండల నాయకులు మెకానిక్‌ సుమాల రాజన్న లతోపాటు వివిధ గ్రామాల కెవిపిఎస్‌ నాయకులు తిమ్మప్ప, చిన్నరాజు, ప్రసాదు, బతకన్న,రాజేష్‌, జయరాజు మరో 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు.