ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : కురుపాం నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి తెలిపారు. ఈ మేరకు శనివారం 'ప్రజాశక్తి'కి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో రోజురోజుకూ టిడిపికి ప్రజాదరణ పెరుగుతోందని చెప్పారు. గౌరవసభ, బాదుడే బాదుడు, ఇదేం కర్మ.. వంటి కార్యక్రమాలతో ప్రజలతో మమేకమైనట్లు తెలిపారు. ఒకవైపు ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, మరోవైపు వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు వివరించినట్లు తెలిపారు. టిడిపి సభ్యత్వ నమోదు వేల సంఖ్యలో చేపట్టామన్నారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అణగదొక్కారని దుయ్యబట్టారు. టిడిపికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అధినేత చంద్రబాబునాయుడును, నాయకులను వైసిపి ప్రభుత్వం నానా ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా ప్రజలు టిడిపి పక్షాన అండగా ఉన్నారని నమ్మకం వ్యక్తం చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని, కురుపాంలో టిడిపి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.










