హిందూపురం : హిందూపురం ఇన్‌ఛార్జి నియామకంలో వైసిపి అధిష్టానం తీసుకున్న నిర్ణయం తనకు శిరోధార్యం అని, దీనికి తాను కట్టుబడి ఉన్నట్లు ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. హిందూపురం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో బుధవారం నాడు ఎమ్మెల్సీ తన నివాసం వద్ద మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇంద్రజతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని హిందూపురం ఇన్‌ఛార్జ్‌గా దీపిక వేణురెడ్డిని నియమించిందన్నారు. ఈ నిర్ణయానికి తాను తన మద్దతుదారులు కట్టుబడి ఉంటాం అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా హిందూపురం నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల బాగోగుల కోసం శక్తివంచన లేకుండా పని చేశానన్నారు. తాను ఎక్కడ ఉన్నా ఈ ప్రాంత ప్రజల క్షేమం కోసం పని చేస్తానని చెప్పారు. 2024 ఎన్నికల్లో హిందూపురంలో టిడిపి కంచుకోటను బద్దలు కొట్టి వైసిపి జెండా ఎగుర వేయాలన్నదే తన లక్ష్యం అన్నారు. హిందూపురంలో తనను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తానన్నారు. తాను ప్రస్తుతం హిందూపురంలో లేనని ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. కొద్దిరోజులు వ్యక్తిగత పనులు నిమిత్తం హైదరాబాదుకు వెళుతున్నట్లు తెలిపారు. తన వ్యక్తిగత పనులు చూసుకుని హిందూపురం తిరిగి వస్తానని చెప్పారు.










