Aug 13,2023 23:53

ప్రజాశక్తి-మామిడికుదురు వర్షాకాలం వ్యాధులు ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శలు వస్తున్నాయి. పారిశుధ్య నిర్వహణ, శుద్ధ జలాన్ని అందించడంపై ఆయా శాఖలకు కనీసం దృష్టి సారించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతిసారతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌, లాంటి విష జ్వరాలపై అవగాహన పెంచేలా గ్రామీణ ప్రాంతాలలో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంలో వైద్య శాఖ నామమాత్రంగా వ్యవహరిసోతంది. వివిధ శాఖల మధ్య సమన్వయ లోపంతో గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన వీధులు మురుగు కోపాలు డంపింగ్‌ యార్డులుగా మారుతూ దుర్గందాలు వ్యాపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత ఆసుపత్రులలో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు చాలా చోట్ల అవకాశమే లేదు.
నిధుల లేమితో పారిశుధ్య నిర్వహణ గాలికి
పంచాయతీల ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం మళ్లించడంతో సర్పంచులు విధులు, నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారారు. పారిశుధ్య నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పి.గన్నవరం నియోజకవర్గంలో సగానికి పైగా మైనర్‌ పంచాయతీలు చిన్న చిన్న పనులు, పారిశుధ్య నిర్వహణకు ఆర్థిక సంఘం నిధుల పైనే ఆధారపడుతున్నాయి. ఫలితంగా పారిశుధ్య నిర్వహణ లేక వీధులు చెత్తతో నిండిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రధాన రహదారుల్లో సిమెంట్‌, కాంక్రీట్‌ రోడ్లు, మురుగు కాలువలను మరిపిస్తున్నాయి. ఈ రోడ్లకి ఇరువైపులా నివాస గృహాల వారు మెరక చేయడంతో నీరు ఎటూ వెళ్లే మార్గము లేక రోజుల తరబడి నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. సిమెంట్‌ రోడ్లపై రోజుల తరబడి తిష్ట వేసిన మురుగునీరు మళ్లింపు చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుచున్నారు.
ముందస్తు చర్యలేవీ..
ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు చెత్త, మురుగు ఉన్న ప్రాంతాల ఫోటోలు తీసి ఆ ప్రాంత దుస్థితి తెలియపరుస్తూ (వెక్టార్‌ కంట్రోల్‌ అండ్‌ హైజీన్స్‌) యాప్‌లో అప్లోడ్‌ చేస్తే పంచాయతీ సిబ్బంది శుభ్రపరిచి ఆ చిత్రాలను తిరిగి ఈ యాప్‌లో నమోదు చేయాలి. సమన్వయ లోపంతో ఈ ప్రక్రియ నామమాత్రంగా మారింది. రోడ్లపై నిలువ మురుగునీరు మళ్లించే చర్యలపై ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుంటే మంచిదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు చర్యలపై దృష్టి సారించాలి
వర్షాకాలం ప్రారంభం కావడంతో అన్ని శాఖలకు పని ఉంటుంది. ముఖ్యంగా తాగునీరు సరఫరా చేసే పైపులైను మురుగునీటిలో ఉన్న వాటిని గుర్తించి లీకేజీలు అరికట్టాలి. మురుగునీరు పైపులలోకి చేరి గృహాలకు చేరిపోతుంది. గృహాలకు సరఫరా చేసే రక్షిత తాగునీరు రంగు మారి కలుషిత నీరు సరఫరా జరుగుతోంది. దీనిపై సంబంధిత ఆర్‌డబ్లుఎస్‌ వైద్య సిబ్బంది, దృష్టి సారించి నీటి పరీక్షలు నిర్వహించి రక్షిత తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. పరిసరాల పరిశుభ్రత కలుషిత ఆహారం తీసుకోకుండా జాగ్రత్తలు, దోమల నియంత్రణ, ప్రణాళిక రూపొందించడంలో అప్రమత్తంగా ఉండాలి. కోనసీమ జిల్లాలో ఎక్కువగా వరద ప్రభావితం గ్రామాలు కావడంతో మురుగునీరు రోజుల తరబడి తిష్ట వేయడంతో పారిశుధ్య స్తంభించి వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున కలెక్టర్‌ హిమాన్స్‌ శుక్లా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ప్రజలు కోరుతున్నారు.