ప్రజాశక్తి - పాలకొండ : నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రేవేట్ విద్యాసంస్థల్లో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ పాలకొండ కేంద్రంలో పీజీ కళాశాల ప్రభుత్వం నిర్మించకపోవడం చాలా దుర్మార్గమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ సిహెచ్.పావని మండిపడ్డారు. ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర శుక్రవారం మండలానికి చేరుకుంది. మొదటగా స్థానిక విద్యాసంస్థల విద్యార్థులతో ఆర్టీసీ డిపో జంక్షన్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పావని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేలా తమ విధానాలను అనుసరిస్తున్నాయని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కనీసం ప్రహరీ గోడ లేకపోవడం వల్ల కళాశాల నిష్పత్తి శాతం పడిపోతుందని, ఉన్నత చదువులకై పీజీ సెంటర్, సొంత హాస్టల్ భవనం లేకపోవడంతో విద్యార్థులు చదువులు మధ్యలోనే నిలిపిచిపోయే పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. కావున ప్రభుత్వ వెంటనే స్పందించి మెరుగైన విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నియోజకవర్గ మండల కేంద్రం విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేపడుతున్న పోరాట కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమ హాస్టళ్లకు బకాయిలు మెస్ ( డైట్ ) బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తొలగించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, డిగ్రీలో తీసుకువచ్చిన హనర్స్ - మైనర్ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలని, డిగ్రీ విద్యార్థులు ఇంటర్న షిప్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్‌ఇపి రద్దు చేయాలని, 117 జిఒ రద్దు చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, హాస్టలల్లో పర్మినెంట్ వర్కర్లను, వార్డన్లను నియమించాలని, పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, హాస్టళ్లలో ఎఎన్‌ఎంలను నియమించాలని డిమాండ్ చేశారు. లేనిచో యాత్ర అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్, కార్యవర్గ సభ్యులు కె.రాజు, హెచ్.సింహాచలం, బి.గంగారావు, కె.భాస్కరరావు, యాత్రలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అఖిల్, ఉమాశంకర్, సిసింద్రీ, అన్నాజీ, వెంకీ పాల్గొన్నారు.










