Nov 16,2023 23:41

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో ఓటర్ల జాబితాల్లో మార్పులు, చేర్పుల వ్యవహారంలో ప్రధాన రాజకీయపక్షాల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్ల జాబితాలే కీలకం కావడంతో టిడిపి ప్రత్యేకంగా ఈ అంశంపై దృష్టి సారించింది. తాజాగా జనసేనతో కలిసి టిడిపి ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫారం-7 ద్వారా తమపార్టీ ఓట్లను తొలగిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. గురువారం సాయంత్రం గుంటూరు కార్పొరేషన్‌లో అధికారులను టిడిపి,జనసేననాయకులు నిలదీశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వేర్వేరు ప్రాంతాల్లో 989 ఓట్ల తొలగింపునకు ఫారం -7లు వైసిపి నాయకులు దాఖలు చేశారని వారు ఆరోపించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌, టిడిపి కార్పొరేటర్‌ వేములపల్లి శ్రీరాం ప్రసాద్‌ తదితరులు కార్పొరేషన్‌లో అధికారులకు తమ నిరసన తెలిపారు. వైసిపినాయకులు ఆ పార్టీ కార్యకర్తల చేత భారీగా ఫారం -7 దరఖాస్తులు దాఖలు చేశారు. ఒక వ్యక్తి దగ్గర నుండి 5 ఓట్ల వరకు మాత్రమే రద్దు దరఖాస్తులు చేయాల్సి ఉండగా ఒక్కో వ్యక్తి సుమారు 150 నుండి 200 దాక ఓట్ల రద్దుకి అప్లికేషన్లు సమర్పించారు. తప్పుడు సమాచారంతో అసలు ఓటర్లకు నోటీసులు జారీ చేయడంపై కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది. ఎవరికి వారు తమ ఓటు ఉందో లేదో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అధికారులకు మూకుమ్మడిగా ఓట్లు తొలగిస్తే తామున్యాయపోరాటానికి వెళ్తామని టిడిపి, జనసేన నాయకులు తెలిపారు. ఓటర్ల ముసాయిదా జాబితాపై స్పెషల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా 4,5తేదీల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో అధికారులు నిమగం అయ్యారు. ఓటు లేని వారు కొత్తగా ఫారం-6తోదరఖాస్తు చేయగా ఓట్ల తొలగింపునకు కొంతమంది ఫారం-7 కూడాపెద్ద సంఖ్యలో దాఖలు చేశారు. వీరిలో స్థానికంగా ఉండటం లేదని, పలువురు మృతి చెందారని, బోగస్‌ ఓటర్ల పేరుతో వైసిపి నాయకులు భారీగా దరఖాస్తులు అందిస్తున్నారని, తమ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపించారు. జిల్లాలో ఇప్పటికే 19 వేల డబల్‌ ఎంట్రీలు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక సాఫ్టువేర్‌ ద్వారా డబల్‌ ఎంట్రీలను గుర్తించి వారికి నోటీసులు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. అలాగే జిరో డోర్‌ నెంబరుపై పెద్ద సంఖ్యలోఓటర్లు ఉన్నారు. వీటిల్లో గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పులో ఒకే డోర్‌నెంబరుపై పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నట్టు తెలిసింది. ఇదేసమయంలో జీరోనెంబరుతో కూడా భారీగా ఓట్లు ఉన్నాయి. ఒకే డోర్‌నెంబరుతో 10కి మించిఓట్లుఉండకూడదన్న నిబంధనను పాటించలేదు. కొత్తగా జిల్లా మొత్తం మీద 1,24,743 మంది ఓటుకోసం దరఖాస్తుచేశారు. అలాగే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారిన వారు 32,064 మంది ఉన్నారు. వీరి దరఖాస్తులకు ఆధార్‌ చిరునామా మార్పు, గ్యాస్‌ బిల్లు, స్థానికంగా నివాసం ఉంటున్నట్టు నిర్ధారణ జరిగితే చిరునామా మార్పుతో ఓటును మారుస్తామని అధికారులు చెబుతున్నారు. సరైన చిరునామా సమర్పించక చాలామంది దరఖాస్తులు పెండింగ్‌లోఉంచారు.