Aug 05,2023 22:52

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : జిల్లాలో పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛమైన జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి సంయుక్త కలెక్టర్‌ డాక్టర్‌ అపరాజిత సింగ్‌, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారులు, జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ, నులిపురుగుల నివారణ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మంగళవారం తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటర్ల జాబితా సవరణ పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారి నుండి స్వీకరించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యేలా చూడాల న్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఒక రిజిస్టరులో సమావేశము తీర్మానాలు (మినిట్స్‌) సజావుగా నమోదు చేసి ఏ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బిఎల్‌ఏలు, ఎన్నికల అధికారులు, ఎవరెవరు పాల్గొన్నారో అందరి పేర్లు తప్పనిసరిగా పేర్కొనా లన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పకడ్బందీగా పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ చేయాలన్నారు. ఎలాంటి ఆధారపత్రాలు తీసుకోకుండా ఉన్న ఓట్లను తొలగిస్తే బాధ్యులైన వారి పైన క్రమశిక్షణ చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈనెల 10వ తేదీ నుండి జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో ఓటర్ల నమోదు అధికారులు (ఈఆర్వోలు), ఏఈఆర్‌ వో లు మునిసిపల్‌ కమిషనర్లు ఎంపీడీవోలు, తదితర అధికారులు పాల్గొన్నారు.