ప్రజాశక్తి కలక్టరేట్ (కష్ణా) : జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి. రాజాబాబు రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారి నగరంలోని వారి చాంబర్లో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ఈనెల 21వ తేదీ వరకు జరుగుతుందన్నారు. బూతు స్థాయి అధికారులు ఇంటిం టికి తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఆ ప్రకారం ఇప్పటివరకు ఓటర్ల జాబితాలో పోలింగ్ కేంద్రాల వారిగా కొత్తగా నమోదైన వారు, చేర్పులు మార్పులు, తొలగింపుల జాబితా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఇవ్వడం జరిగిందన్నారు. అనవసరమైన ఫిర్యాదులు రాకుండా ఉండాలని ఉద్దేశంతో అన్ని జాబితాలను పారదర్శకంగా అందరికీ పంపిణీ చేశామన్నారు. ఆ జాబితాలను పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ జేయాలని కోరారు. ఇంకా ఏమైనా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం పై వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కూడా తెలియజేయాలన్నారు.నూటికి నూరు శాతం స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేయాలన్నదే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశం అన్నారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ బిఎల్వోలు పరిశీలనకు వస్తున్నారు గాని ఓటర్లు ఉన్న సమయంలో రావడం లేదన్నారు. ముఖ్యంగా కూలీలు తదితరులు ఉదయమే పనులకు వెళ్లి సాయంత్రం గాని రావడంలేదని అటువంటి వారికి సాయంత్రం పరిశీలన జరపాలని కోరారు. దీంతో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఓటర్లు ఇంటి వద్ద ఉండే సమయంలో గమనించుకొని అప్పుడే జాబితా పరిశీలన చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ ఎం .వెంకటేశ్వర్లు, వైసిపి,టిడిపి, కాంగ్రెస్, సిపిఎం, బీఎస్పీ ,జనసేన పార్టీల ప్రతినిధులు దాదా షేక్ సిలార్, దాదా, బి ఎం వి దాసు, దిలీప్ కుమార్, కె చంద్రశేఖర్, కొడాలి శర్మ, ఎస్ బాలాజీ, వి చౌదరి, అధికారులు శీను నాయక్ పాల్గొన్నారు.










