ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలి: ఆర్డీవో
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలని శ్రీకాళహస్తి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి చెప్పారు. శ్రీకాళహస్తి తహశీల్దారు కార్యాలయంలో శనివారం ఆయన ఓటర్ల జాబితా సవరణపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఓటర్ల జాబితా పారదర్శకంగా తయారు చేయడానికి రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా ఓటర్ల తొల గింపులు, చేర్పులు విషయంలో జాగ్రత్తలు తీసుకో వాలన్నారు. ఏదైనా ఒక పోలింగ్ బూతులో రెండు శాతానికి మించి ఓట్లు తొలగించినా... అదేవిధంగా నాలుగు శాతానికి మించి ఓటర్లను చేర్చినా తానే స్వయంగా ఆ పోలింగ్ బూతును పరిశీలిస్తానని రవిశంకర్ రెడ్డి చెప్పారు. ఓటరు జాబితా నుంచి ఓటు తొలగించాలంటే తప్పకుండా మరణ ధవీకరణ పత్రం సమర్పించాలన్నారు. ఓటు మార్పు చేయాలన్నా సంబంధిత ఓటరు నుంచి అంగీకార పత్రం తీసుకోవాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. రాజకీయ పార్టీల నేతలు సహకరిస్తే ఓటర్ల జాబితా పారదర్శకంగా తయారు చేయవచ్చని ఆర్డీవో రవిశంకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక అంతకు మునుపు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయంలో ఓటర్ల జాబితాకు సంబంధించి సూపర్ వైజర్లతో సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ రెడ్డి సూపర్ వైజర్లకు పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. ఇలాంటి వీరిని ఈ ఏడాది డిసెంబరు 9వ తేదీలోగా ఓటర్లుగా చేర్చాలన్నారు. ఇక వచ్చే ఏడాది అంటే 1 ఏప్రిల్ 2024, 1 జూలై 2024 లేదా 1 అక్టోబర్ 2024న ఏదైనా తదుపరి అర్హత తేదీలలో పద్దెనిమిది సంవత్సరాల వయస్సును చేరుకోబోయే అర్హత కలిగిన పౌరుడు ఓటర్ల జాబితాలో అతని లేదా అమె పేరును చేర్చడం కోసం అతని లేదా ఆమె క్లెయిమ్ ను ఫారమ్-6లో, నోటీసు తేదీ నుండి ముందుగానే దాఖలు చేయవచ్చన్నారు. ఈ ఏడాది నవంబరు 4,5వ తేదీ, డిసెంబరు 2,3వ తేదీలను ప్రత్యేక ప్రచార రోజులుగా ప్రకటించామన్నారు. ఆ రోజుల్లో బూత్ లెవల్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. ఈ సమావేశంలో పురపాలక సంఘం కమిషనరు ముప్పాళ్ల రమేష్ బాబు, తహశీల్దార్లు ద్వారకనాథరెడ్డి, ఎర్రంరెడ్డి సుధీర్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నేతలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.










