ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శుక్రవారం బోయలపల్లి గ్రామంలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని, అక్రమాలు, అరాచకాలు ఎక్కువైపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో కుల మతాలకు తావు లేకుండా అందరికీ సమన్యాయం చేస్తూ వారి అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని తెలిపారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను, గిరిజనులను, దళితులను ఒక్కొక్కరి పథకాలను నిలిపివేస్తూ అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు చంద్రబాబుపై రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక అక్రమ కేసు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. అయితే ఆయన్ను ఎన్ని కేసుల్లో ఇరికించినా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి యర్రగొండపాలెం మండల కన్వీనర్ చేకూరి సుబ్బారావు, టిడిపి యర్రగొండపాలెం పట్టణ అధ్యక్షుడు షేక్ మస్తాన్వలి, కామేపల్లి వెంకటేశ్వర్లు, వేగినాటి శ్రీను, కాకర్ల కోటయ్య, శనగ నారాయణరెడ్డి, షేక్ మాబు, కోట డేవిడ్, గాలయ్య, చెవుల అంజయ్య, శ్రీశైలపతి నాయుడు, షేక్ ఇస్మాయిల్, తోటా మహేష్ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










