Aug 19,2023 23:14

బిఎల్‌ఒలకు కలెక్టర్‌ పి.రాజాబాబు హెచ్చరిక
ప్రజాశక్తి-గన్నవరం :
సరైన ఆధారాలు లేకుండా ఓట్లను తొలగిస్తే మీ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని జిల్లా కలెక్టర్‌ పి. రాజబాబు బిఎల్‌ఓలను హెచ్చరించారు. శనివారం గన్నవరం తహసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో జరిగిన నియోజకవర్గంలోని బిఎల్‌ఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల నమోదులు, చేర్పులు, మార్పుల విషయంలో ప్రతి బిఎల్‌ఓ ఒక రికార్డు పెట్టుకోవా లన్నారు. ముఖ్యంగా ఓట్ల తొలగింపు వ్యవహారంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, ఓటు తొలగించేటప్పుడు ఖచ్చితమైన ఆధారాలను రికార్డు చేసుకుని, సంబంధిత వ్యక్తులతో పాటు చుట్టుపక్కల వారి వద్ద నుంచి సంతకాలు తీసుకుని అప్పుడు తొలగించాలని చెప్పారు. ముఖ్యంగా చనిపోయిన వారి పేర్లు, ఒకటికి రెండుసార్లు వచ్చిన పేర్లు, ఇతర ప్రాంతాలకు వలస పోయిన వ్యక్తుల ఓట్లు మాత్రమే తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. దానికి సంబంధించిన ఆధారాలను ఒక పుస్తకంలో బైండింగ్‌ చేసి పెట్టుకోవాలన్నారు. ఈ విషయంలో గన్నవరంలో ని బిఎల్వోలు మాత్రమే సక్రమంగా వ్యవహరించారని, మిగతా వారి దగ్గర ఆధారాలు లేకుండా ఉన్న పరిస్థితి కనిపించిందన్నారు. ప్రతి ఒక్కరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తర్వాత జరిగే పరిణామాలకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని కలెక్టర్‌ హెచ్చరించారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌ పరిధిలో 20 నుంచి 25 సమస్యలు మాత్రమే వస్తాయని, వాటిని జాగ్రత్తగా పరిష్కరించాలన్నారు. ఇంకా రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉందని అందరూ తమ రికార్డులను తప్పులు లేకుండా సరిచేసుకుని బైండింగ్‌ తో అధికారులకు సమర్పించాలన్నారు. తొలగించిన ఓట్ల వివరాలను పోస్టల్‌ ద్వారా సంబంధిత వ్యక్తులకు పంపించాలన్నారు. ఓట్ల తొలగింపులో రాజకీయ వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోవా లన్నారు. బిఎల్వోలు మీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని చెప్పారు. ఓట్ల చేర్పులు, తొలగింపుల విషయంలో ఎలక్షన్‌ కమిషన్‌ చాలా సీరియస్‌ గా తీసుకుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ వివాదాల జోలికి పోకుండా పనిచేయాలని సూచించారు. మండల స్థాయి అధికారులు పర్యవేక్షిం చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఅర్‌ఓ, తహసి ల్దారులు పాల్గొన్నారు. తొలుత రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సగంలో ఆగిపోయిన రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణ సముదాయాలను ఆయన చూశారు.