Sep 17,2023 11:21

న్యూఢిల్లీ :  జమ్ముకాశ్మీర్‌లో అనంతనాగ్‌ జిల్లాలో చేపడుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌ ఆదివారంతో ఐదోరోజుకి చేరింది. భద్రతా దళాల ఆపరేషన్‌ను చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించింది. అడవుల్లోని పలు రహస్య స్థావరాలపై భద్రతా దళాలు మోర్టార్‌ షెల్‌లను ప్రయోగించాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం డ్రోన్స్‌, హెలికాఫ్టర్‌లను వినియోగిస్తున్నట్లు అన్నారు. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ, పోలీస్‌ అధికారులు సహా ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే.

అటవీ ప్రాంతంలో గుహల వంటి అనేక రహస్య స్థావరాలు ఉన్నాయని, వాటిని గుర్తించేందుకు డ్రోన్‌లను వినియోగిస్తున్నామని అన్నారు. భద్రతా బలగాలు షెల్స్‌ ప్రయోగించడంతో అడవిలోని ఓ రహస్య స్థావరం ధ్వంసమవగా, ఉగ్రవాది పరుగులు తీస్తున్న దృశ్యాలు విడుదలయ్యాయి. ఉగ్రవాదులు గ్రామాల్లోకి రాకుండా ముందుజాగ్రత్త చర్యగా అటవీ ప్రాంతానికి సమీపాన ఉన్న పోష్‌క్రిరీ ప్రాంతానికి భద్రతా బలగాలను మోహరించినట్లు తెలిపారు. నార్తర్న్‌ అర్మీ కమాండర్‌ శనివారం కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు.