ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ ప్రాథమిక విద్య నిర్వీర్యం అయ్యేలా తీసుకొచ్చిన 117 జిఓ రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని ఏపిటిఎఫ్ రాష్ట్ర పూర్వపు అధ్యక్షులు ఎన్.రఘురామిరెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాయల్ వెంకటేష్, ఎస్.సిరాజుద్ధీన్ డిమాండ్ చేశారు. శనివారం ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో 31 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, 117 జిఓతో ప్రాథమిక పాఠశాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందన్నారు. విద్యార్థులు లేక ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు పని భారం ఎక్కువైందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ప్రభుత్వం తెచ్చి ఉపాధ్యాయ లోకాన్ని ఒత్తిడికి గురి చేస్తోందన్నారు. మినిమం టైం స్కేల్ పై నియమించబడిన1998, 2008 ఉపాధ్యాయులను రెగ్యులర్ ప్రతిపాదికన నియమించాలని, జూలై 2023 నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఐఆర్‌ను ప్రకటించాలన్నారు. విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ఉపాధ్యాయుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు, వైఖరి మార్చుకోవాలని, కేజీబీవీ సిబ్బందికి అన్ని రకాల రెగ్యులర్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిఆర్‌ఓ గాయత్రి దేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డి.ప్రభాకర్, జిల్లా సబ్ కమిటీ సభ్యులు డేనియల్, మోహన్ రెడ్డి, రాందాస్ రెడ్డి, రామాంజనేయులు, సతీష్, ఓబులేసు, సుభద్ర, రాష్ట్ర కౌన్సెలర్లు రమణ, శ్యామ్ రవి, అంజలీ, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎపిటిఎఫ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు ఎన్.రఘురామిరెడ్డి










