Aug 10,2023 13:17

ముంబయి :   పట్టపగలే ఓ వ్యాపార వేత్తను కిడ్నాప్‌ చేయడంతో పాటు అతనిపై దాడికి దిగినట్లు శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే ప్రకాష్‌ సుర్వే కుమారుడు రాజ్‌ సుర్వేపై కేసు నమోదైంది. నిందితులను అదుపులోకి తీసుకుని, వ్యాపారవేత్తను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌ సుర్వే, ఆదిశక్తి ప్రై.లి మ్యూజిక్‌ కంపెనీ యజమాని మనోజ్‌ మిశ్రాలపై సుమారు 10 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు వెల్లడించారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ముంబయి శివారులోని ఓ మ్యూజిక్‌ కంపెనీ సిఇఒ రాజ్‌ కుమార్‌ సింగ్‌ మనోజ్‌ మిశ్రాకు రూ.8కోట్లు అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా స్థానిక శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్‌ సర్వే అండతో మనోజ్‌ రాజ్‌కుమార్‌పై బెదిరింపులకు దిగినట్లు సమాచారం. బుధవారం మధ్యాహ్నం సుమారు 12 మంది వ్యక్తులు రాజ్‌కుమార్‌ ఆఫీసులోకి చొరబడి అతడిపై దాడి చేశారు. తుపాకీతో బెదిరించి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. రాజ్‌ ఆఫీసులో పనిచేసే సిబ్బంది ఒకరు వెంటనే పోలీసులకు   సమాచారమిచ్చారు. అప్రమత్తమైన పోలీసులు కార్‌ను చేజ్‌ చేసి రాజ్‌కుమార్‌ను రక్షించారు. అయితే, అప్పటికే నిందితులు అక్కడి నుండి పారిపోయినట్లు  తెలిపారు.