ప్రజాశక్తి - చిలమత్తూరు : ఎండల తీవ్రత తగ్గకపోవడంతో రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలను వేసవి సెలవుల తర్వత కూడా ఒంటి పూట బడిని నిర్వహిస్తోంది. ఉదయం 7:30 గంటల నుండి 11:30 గంటల వరకు పాఠశాలను నిర్వహించాలని ఆదేశించింది. ఈ బడి సమయం గ్రామీణ ప్రాంతాలలోని ప్రాథమిక పాఠశాలలు వరకు ఇబ్బంది లేకపోయినా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాత్రం ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుండి మండల/పంచాయతీ కేంద్రాలలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ఉదయం 6 గంటలకే ఇంటి నుండి బయలు దేరాలి. దీంతో టిపెన్ తినే అవకాశం ఉండదు. ఇక పాఠశాలకు వచ్చిన తర్వత కూడా పాఠశాల వదిలే సమయంలో 11:30 గంటలకు భోజనం పెడుతుండటంతో విద్యార్థులు ఆకలికి తట్టుకోలేక విలవిలలాడుతున్నారు. కొందరు 11:30 గంటల వరకు కడుపు మాడ్చుకొని ఉంటున్నా మరి కొంత మంది రోడ్డుపై తోపుడు బండ్ల దగ్గర, హోటళ్ల దగ్గర తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. విద్యార్థుల అవస్థలు చూసిన ప్రజలు ఉదయం 8గంటలకే టిపెన్ పెట్టి తర్వాత పాఠశాల కొనసాగించవచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు.










