Jun 24,2023 08:54

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగ సభలో ప్రసంగిస్తున్న బికె.పార్థసారధి

        కదిరి టౌన్‌ :2019 ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఒక్క ఛాన్స్‌ పేరుతో అధికారంలోకి వచ్చి, గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేశారని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు టిడిపి గ్యారెంటీ పేరుతో చేపట్టిన జోన్‌-5 ప్రచార బస్సుయాత్ర శుక్రవారం ఉదయం కదిరిలో ప్రారంభం అయ్యింది. కదిరి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో శ్రీమద్‌ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించి బస్సుయాత్రను ప్రారంభించారు. అనంతరం కదిరి దర్గాలో ముస్లిములతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ బస్సుయాత్ర రాయలసీమ సర్కిల్‌, టవర్‌ క్లాక్‌ మీదుగా కాలేజ్‌ సర్కిల్‌ చేరుకుంది. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి జిల్లా టిడిపి అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, బికె.పార్థసారథి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ బిటి.నాయుడు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజి మంత్రి ఫారుఖ్‌, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నం హనుమంతరాయ చౌదిరి, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కందికుంట వెంకటప్రసాద్‌, పరిటాల శ్రీరామ్‌, బండారు శ్రావణి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్ధేశించి నాయకులు ప్రసంగించారు. రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్‌ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారాన్ని చేపట్టారన్నారు. అధికారం చేపట్టాక ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్యే ఇందుకు నిదర్శనం అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసిపి ఎమ్మెల్యేలు, నాయకులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలకు అంతేలేదన్నారు. టిడిపి నేతలు అచ్చెం నాయుడు, కొల్లు రవీంద్రా, పట్టాభిరాము తదితరులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని గుర్తు చేశారు.
మినీమేనిఫెస్టోతో ప్రజలకు భరోసా..
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇటీవల రాజమండ్రిలో జరిగిన మహానాడులో టిడిపి మినీమేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. అందులో భాగంగా మహిళల కోసం జిల్లాలో ఉచిత ప్రయాణ సదుపాయం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం, బీసీల కోసం ప్రత్యేక చట్టం, అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అంతమందికి ఏడాదికి రూ.20వేల సాయం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3000 హామీలు ఇచ్చారన్నారు. దేశ చిత్రపటంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అన్నారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించి వైసిపి అరాచకపాలన అంతం చేసి టిడిపిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కదిరికి కందికుంట... రాష్ట్రానికి చంద్రబాబు..
రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని, కదిరి ఎమ్మెల్యేగా కందికుంట వెంకటప్రసాద్‌ను గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు. కదిరి నియోజకవర్గం ప్రజలకు ఏ సమస్య వచ్చినా జగన్మోహన్‌రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తాం అని చెప్పిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కోసం గొడ్డలి కొనుగోలు చేసేందుకు కదిరిని వాడుకున్నారే తప్పా ఈ ప్రాంత ప్రజల అభివద్ధి కోసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం టౌన్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు జెఎల్‌.మురళీధర్‌, నాయకులు సుధాకర్‌, దేవళ్ల మురళి, మాజీ మహిళా కమిషన్‌ సభ్యురాలు పర్వీన్‌బాను, కదిరి టిడిపి పట్టణ అధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన్‌, ఎస్వీ నాగేంద్రప్రసాద్‌, తెలుగు యువత నాయకులు, గంగయ్య నాయుడు, ఎస్సీ సెల్‌ నాయకులు రాజశేఖర్‌ బాబు, పాల్గొన్నారు.