Oct 02,2023 22:19

2019 ఎన్నికల్లో జిల్లాలో వైసిపి వరాల జల్లు
ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ అమలుకాని పరిస్థితి
అటకెక్కిన పోలవరం నిర్వాసితుల పరిహారం, వాటర్‌ గ్రిడ్‌
చింతలపూడి ఎత్తిపోతల రైతులకూ అన్యాయమే
ప్రకటనలతో సరిపెడుతున్న కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణం
తెరచుకోని చాగల్లు సుగర్‌ ఫ్యాక్టరీ

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి
ఎన్నికల్లో గెలుపొందడానికి పలు హామీలు గుప్పించడం, ఆ తర్వాత మరిచిపోవడం రాజకీయ పార్టీలకు సర్వసాధారణమైంది. 2019 ఎన్నికల్లో జిల్లా ప్రజలకు అత్యంత అవసరైన పలుహామీలను వైసిపి గుప్పించింది. అధికారంలోకొచ్చి నాలుగున్నరేళ్లు పూర్తయినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలుచేయలేదు. దీంతో మరోసారి మోసపోయామంటూ జిల్లా ప్రజానీకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానుండటంతో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం దృష్టిసారిస్తుందా అన్న చర్చ సైతం నడుస్తోంది.
'మాటతప్పం.. మడమతిప్పం' అంటూ వైసిపి నాయకులు పదేపదే చెబుతున్న మాట. గడిచిన ఎన్నికల్లో జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. 2019 ఎన్నికల్లో జిల్లాలో జరిగిన ప్రధానపాత్ర పోషించిన హామీల్లో ప్రధానమైనది వాటర్‌గ్రిడ్‌ నిర్మాణం. డెల్టాలోని దాదాపు 25 మండలాల్లో ఈ హామీ తీవ్ర ప్రభావం చూపిందని చెప్పొచ్చు. ఆక్వా చెరువులు పెరిగిపోవడంతో డెల్టాలోని తాగునీటి వనరులన్నీ కలుషితమయ్యాయి. అక్కడి జనం తాగేందుకు గుక్కెడు తాగునీరు లేకుండా పోయింది. కొనుగోలు చేస్తే తప్ప దాహం తీరడం లేదు. దీంతో వైసిపి అధినేత జగన్‌ తన పాదయాత్రలోగానీ, ఎన్నికల ప్రచారంలోగానీ తాగునీటి సమస్యపైనే ఎక్కువగా మాట్లాడేవారు. వైసిపి అధికారంలోకి వస్తే వాటర్‌గ్రిడ్‌ పథకం ఏర్పాటు చేస్తామని, గోదావరి నుంచి నేరుగా పైప్‌లైన్ల ద్వారా తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత రూ.3,200 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి సైతం చేశారు. తర్వాత డెల్టాకు మాత్రమే పరిమితం చేస్తున్నట్లు చావుకబురు చల్లగా చెప్పారు. అయినప్పటికీ కానీ నేటికీ వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి ఒక్క అడుగూ ముందుకు పడలేదు. దీంతో ఇప్పటికీ జనం తాగునీరు కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో జిల్లా ప్రజలకు ఇచ్చిన తాగునీటి వంటి ప్రధాన హామీని కూడా ప్రభుత్వం నెరవ్చేలేకపోయింది. రాష్ట్రానికి జీవనాడి అని చెబుతున్న పోలవరం ప్రాజెక్టు కోసం సర్వంత్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం పెంచుతామని హామీ ఇచ్చింది. పునరావాస ప్యాకేజీ రూ.6.25 లక్షల నుంచి రూ.పది లక్షలు పెంపుచేసి అందిస్తామని చెప్పింది. 2006కు ముందు సేకరించిన భూములకు రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రధానంగా ఇచ్చిన ఈ రెండు హామీలను కూడా వైసిపి ఇప్పటికీ అమలు చేయలేదు. ఇచ్చిన హామీల అమలు చేయకపోగా పోలవరం నిర్వాసితలుకు ఇప్పటికీ పరిహారం అందించలేదు. దీంతో ప్రతిఏటా వరదలకు పోలవరం నిర్వాసితులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్లు బతుకులు నెట్టుకొస్తున్నారు. అధికారంలోకొచ్చిన రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్న హామీ సైతం అలానే ఉండిపోయింది. కొల్లేరులోకి సముద్రంలోని ఉప్పునీరు చేరకుండా ఉప్పుటేరుపై రెగ్యులేటర్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలంలోని పడితడక వద్ద వీటిని నిర్మిస్తామని ప్రకటించారు. అందుకోసం రూ.400 కోట్లకు పైగా నిధులను సైతం మంజూరు చేసినట్లు చెప్పినప్పటికీ పనులు మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులు తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ టిడిపి ప్రభుత్వంలో పెద్దఎత్తున నిరసనలు, రిలే దీక్షలు చేశారు. 2019 ఎన్నికల్లో చింతలపూడి బహిరంగసభలో జగన్‌ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకొచ్చాక రైతులకు న్యాయమైన పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకూ ఆ ఊసే లేదు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మూతపడిన చాగల్లు సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ సుగర్‌ ఫ్యాక్టరీ తెరచుకోలేదు. కార్మికులకు ఎలాంటి న్యాయమూ జరగలేదు. గత ఎన్నికల్లో రోడ్ల నిర్మాణంపైన వైసిపి పలు హామీలిచ్చింది. ఇప్పటికీ రోడ్ల వ్యవస్థ బాగుపడలేదు. ఇవికాకుండా ఆయిల్‌పామ్‌, పొగాకు రైతులకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు సైతం సక్రమంగా అమలు చేయలేదు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం జిల్లా ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలను పక్కకు పెట్టడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉన్న కొద్దిరోజుల పాలనలోనైనా ఇచ్చిన హామీలను నెరువేరుస్తుందో వేచిచూడాల్సి ఉంది.