Sep 15,2023 21:46

ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వైద్య కళాశాల సిబ్బంది, విద్యార్థులు

         ప్రజాశక్తి-అనంతపురం   ఒకేరోజు ఐదు మెడికల్‌ కళాశాలలను సిఎం జగన్‌ ప్రారంభించడం దేశంలోనే చారిత్రాత్మక ఘట్టమని మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని వైద్య విద్యార్థులతో సిఎం జగన్‌ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో అనంత వైద్య కళాశాలలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వైద్య విద్యార్థులు, పోస్టు గ్రాడ్యుయేట్‌ వైద్య విద్యార్థులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరంలో సిఎం జగన్‌ స్వయంగా మెడికల్‌ కళాశాలను ప్రారంభించగా నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరంలో వర్చువల్‌గా ప్రారంభించారన్నారు. అంతేగాకుండా ఈఏడాది నుంచే 750 మంది ఎంబిబిఎస్‌ విద్యార్థులు వైద్య విద్య చదివే అవకాశం కల్పించడం సంతోషకరమన్నారు. వచ్చే సంవత్సరం మరో ఐదు కళాశాలలను ప్రారంభించాలన్న దృఢ సంకల్పంతో సిఎం జగన్‌ ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి, వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ కెఎల్‌.సుబ్రమణ్యం, సహాచార్య బి.ఆర్‌ శ్యాంప్రసాద్‌, వైద్యులు వాల్మీకి శ్రీనివాస్‌, డాక్టర్‌ తెలుగు మధుసూదన్‌, ఆశాలత, సుమన గోపీచంద్‌, బోనాల షహజీర్‌, పునర్జీవన్‌కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఆదిరెడ్డి పరదేశీనాయుడు, తదితరులు పాల్గొన్నారు.