Sep 22,2023 11:28

వాషింగ్టన్‌ :   అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ)కు చెందిన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతి నాయక్‌కు ప్రతిష్టాత్మక నార్మన్‌ బోర్లాగ్‌ అవార్డు వరించింది. వరల్డ్‌ ఫుడ్‌ ఫ్రైజ్‌ ఫౌండేషన్‌ అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఈ ఏడాది ఒడిశాకు చెందిన స్వాతిని నాయక్‌ను ఎంపిక చేసింది. ఆమె న్యూఢిల్లీలోని ఐఆర్‌ఆర్‌ఐ కేంద్రంలో విత్తన పరిశోధన విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. వరిపంట సాగుచేసే చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమెకు ఈ అవార్డు ప్రకటించినట్ల్లు వరల్డ్‌ ఫుడ్‌ ఫౌండేషన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపింది. ఆమె ''అత్యుత్తమ యువ శాస్త్రవేత్త'' అని ప్రశంసించింది.  ఈ క్షణం ఒక కొత్త ప్రారంభమని  డాక్టర్‌ స్వాతి నాయక్‌ అన్నారు.  ఫీల్డ్‌ సైంటిస్ట్‌గా తన ప్రయత్నాలను, గొంతుకను, పనిని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.

స్వాతి  నాయక్‌ 500 కంటే ఎక్కువ వరి రకాల కోసం 10,000 కంటే ఎక్కువ విస్తఅతమైన ఆన్‌-ఫార్మ్‌ పరీక్షలను నిర్వహించారు, ఆసియా మరియు ఆఫ్రికా అంతటా వివిధ దేశాల్లోని విభిన్న పర్యావరణ వ్యవస్థల్లో ఈ ట్రయల్స్‌ని చాలా సూక్ష్మంగా అమలు చేయడం కోసం వేలాది మంది చిన్న రైతులతో కలిసి పనిచేశారు. ఈ అవార్డును అక్టోబర్‌ 24-26 తేదీలలో స్వీకరించనున్నారు. హరిత విప్లవ పితామహుడు, నోబెల్‌ గ్రహీత నార్మన్‌ ఇ.బోర్లాగ్‌ పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ఆకలిని నిర్మూలించి ఆహార భద్రతను సాధించడానికి తోడ్పడే 40 ఏళ్లలోపు యువ శాస్త్రవేత్తలకు అందిస్తోంది.