Jun 29,2023 21:43

దాతలను సన్మానిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : మండల పరిధిలోని జగరాజుపల్లి కొండపై ఉన్న ఓబులేశ్వరుని స్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఓబులేసుని కొండను ఆయన గురువారం సందర్శించారు. కొండ క్రింది భాగాన నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపాన్ని పరిశీలించారు. అనంతరం కొండపైకి రహదారి ఏర్పాటు పనులను పరిశీలించారు. మట్టి రోడ్డు కోతకు గురైన కారణంగా ద్విచక్ర వాహనాల సైతం వెళ్లలేని పరిస్థితులలో ఉన్న పరిస్థితులను ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గోరంట్ల- ధర్మవరం ప్రధాన రహదారి నుండి కొండ క్రింది భాగం వరకు తారు రోడ్డు నిర్మించి, అక్కడనుండి కొండ బాగాన సిసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఓబులేశ్వర స్వామి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లక్ష్మీనరసమ్మ గంగాధర, ఎంపీపీ రమణారెడ్డి, వైసిపి ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు తిరుపాల్‌ నాయక్‌, మండల కన్వీనర్‌ నరసారెడ్డి, జగరాజుపల్లి సర్పంచి మల్లిరెడ్డి, ఓబులేశ్వర స్వామి ట్రస్ట్‌ చైర్మన్‌ గోవిందప్ప, కమిటీ సభ్యులు మాజీ సర్పంచి సూర్యనారాయణ రెడ్డి, ఉమాపతి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి విరాళాలు : మండల పరిధిలోని జగరాజుపల్లి ఓబులేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం భక్తులు భారీగా విరాళాలు ప్రకటించారు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా కొండపై వెలసిన ఓబులేసునికి గురువారం ఆలయ అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు. మండల వాసులే కాక ఇతర మండలాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఓబులేశ్వర స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో కొండ క్రింది భాగాన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొండకు వెళ్లి తిరిగి వచ్చిన భక్తుల ఈ అన్న ప్రసాదాలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయ అభివృద్ధికి భారీగా విరాళాలు ప్రకటించారు. మాజీ సర్పంచి జగరాజుపల్లి ఆర్‌ సూర్యనారాయణ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన సివిల్‌ ఇంజనీర్‌ శ్రీనివాసులు, కే ఓబులమ్మ, నిమ్మకాయల గోవిందప్ప, రిటైర్డ్‌ ఎస్‌ఐ వెంకట గారి పల్లి రాజేందర్‌ రెడ్డి, బత్తలపల్లి టీచర్‌ భగవతప్ప, ఎం నారాయణరెడ్డి, జి ఓబులేషు తదితరులు ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున ఆలయ అభివృద్ధికి విరాళాలు ప్రకటించారు. అదేవిధంగా అమెరికలో నివాసం ఉంటున్న రమణమ్మ రూ. 50వేలు విరాళం ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కొండపైకి నీటి వసతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు గౌనికుంటపల్లి జనార్దన్‌ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. కొండ క్రింది భాగంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండప నిర్మాణానికి భక్తాదులు సహకరించాలని వారు కోరారు.