Oct 26,2023 07:52
  •  నీతి ఆయోగ్‌ అదనపు కార్యదర్శి రాధ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వికసిత్‌ భారత్‌-2047లో భాగంగా నీతి ఆయోగ్‌ సహకారంతో స్టేట్‌ విజన్‌ ప్లాన్‌-2047ను డిసెంబరు నాటికి సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఉన్నత అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రణాళికశాఖ ఆధ్వర్యాన మూడు రోజులపాటు జరగనున్న వర్క్‌షాపు వెలగ పూడిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం ప్రారంభమైంది. నీతి ఆయోగ్‌ అదనపు కార్యదర్శి వి రాధ అధ్యక్షత వహించి మాట్లాడారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అందజేసి, వారికి సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌-2047 చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర అధికారులు సమగ్రమైన స్టేట్‌ విజన్‌ ప్లాన్‌-2047ను సాధ్యమైనంత త్వరగా రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రణాళికశాఖ కార్యదర్శి ఎం గిరిజాశంకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాథమిక రంగానికి సంబంధించి వ్యవసాయం, పశుసంవర్థక, డెయిరీ, ఫిషరీష్‌, ఉద్యానవనం, సెరీకల్చర్‌, మార్కెటింగ్‌ శాఖల అభివృద్ధిపై వ్యూహాత్మక వృద్ధి సాధించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు వర్క్‌షాపులో భాగంగా ఉదయం సామాజిక రంగానికి సంబంధించిన వైద్య, ఆరోగ్యం, స్త్రీ శిశు, వికలాంగులు, వృద్ధులు, సంక్షేమం, పౌర సరఫరాలశాఖతో పాటు వ్యవసాయ అనుబంధ 12 శాఖలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కమిషనరు జె నివాస్‌, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సిఇఒ హరీందర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.