- క్రమశిక్షణ సంఘం కమిటీ సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు
ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : నాయి బ్రాహ్మణుల నమ్మకద్రోహి రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి అని టిడిపి జాతీయ క్రమశిక్షణ సంఘం కమిటీ సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు అన్నారు. నాయి బ్రాహ్మణులకు వైసిపి ప్రభుత్వం చేస్తున్న అణిచివేత దోరణికి నిరసిస్తూ జాతీయ క్రమశిక్షణ సంఘం కమిటీ సభ్యులు గుంటుపల్లి నాగేశ్వరరావు శుక్రవారం స్థానిక పార్లమెంట్ కార్యాలయం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను నమ్మించి వంచించి నట్టేట ముంచిన ఘనుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తరతరాలుగా నాయి బ్రాహ్మణులు చేతి వృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తుంటే నేడు జగన్మోహన్ రెడ్డి బహుళ జాతి కంపెనీలతో కుమ్మక్కై రాష్ట్రంలో బహుళ జాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసి నాయి బ్రాహ్మణులను స్ట్రీట్ వేండర్స్ గా మార్చి నాయి బ్రాహ్మణుల పొట్ట కొట్టాడని అవేదన వ్యక్తం చేశారు . అలాగే పోరాటాలతో సాధించుకున్న నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కి నిధులను మంజూరు చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం తెలుగుదేశం పార్టీ హయాంలో పేద బలహీన వర్గాల నాయి బ్రాహ్మణులకు లక్ష రూపాయల సబ్సిడీతో రెండు లక్షలు రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అదే రాజారెడ్డి రాజ్యాంగంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేయూత పేరుతో రూ పది వేలు ఇచ్చి వారిని మోసం చేశారన్నారు. ఆ పది వెలు ఆ షాపులో పనిచేసే వారి జీతం కంటే తక్కువన్నారు. అలాగే గత ఎన్నికల ప్రచారంలో దేవాలయాల్లోని నాయి బ్రాహ్మణులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసి నేడు వారికి 65 సంవత్సరాల రిటైర్మెంట్ ఇచ్చి వారి జీవనాన్ని దెబ్బ కొడుతున్నరన్నారు. అలాగే టిడిపి హాయంలో నాదస్వరము, డోలు కళాశాలలో ఏర్పాటు చేసి నాయి బ్రాహ్మణుల కళాకారులను ఎంతో ప్రోత్సాహం ఇస్తే నేడు జగన్మోహన్ రెడ్డి వాటిని నిలిపివేశారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచే దేవాలయాల్లో పనిచేస్తున్న సుమారు పదకొండు వందల మంది నాయి బ్రాహ్మణులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించి వారికి ప్రభుత్వం నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు వంద కోట్లు నిధులు మంజూరు చేయాలని, అదేవిధంగా మూతపడిన నాయి బ్రాహ్మణుల కళాకారుల కొరకు ఏర్పాటుచేసిన నాగ స్వరము డోలు వాయిద్య కళాశాలను తిరిగి పున ప్రారంభించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రానున్న ప్రజాక్షేత్రంలో న్యాయ బ్రాహ్మణులందరూ ఏకతాటి పైకి వచ్చి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థులను ఓడించడంలో ముఖ్యపాత్ర పోషిస్తారన్నారు. అదేవిధంగా రాజకీయాలలో నాయి బ్రాహ్మణులకు మరింత అవకాశం కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 14 మంది సభ్యులు ఒక కన్వీనర్ తో వేసిన జిల్లా నాయి బ్రాహ్మణ సాధకారిక కమిటీకి రాష్ట్రంలోనే నాయి బ్రాహ్మణులందరు తరపున నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో దాలిపర్తి ప్రసాద్, జిల్లా నాయి బ్రాహ్మణ సాధికారక కమిటీ కన్వీనర్ ఆముదలపల్లి గోపాలకృష్ణ, గన్నవరం నుండి పావులూరి రాంప్రసాద్, పెనమలూరు నుండి వణుకూరి రాఘవ, వణుకూరి విక్రమ్, అవనిగడ్డ నుండి కోడూరు నాగరాజు, కొమ్మలపాటి పాండురంగారావు, మచిలీపట్నం నుండి కొండూరి మురళి తదితరులు పాల్గొన్నారు.










