Jul 15,2023 20:17

మాట్లాడుతున్న ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ నారాయణ

ప్రజాశక్తి - చిప్పగిరి
వాలంటీర్ల పరిధిలోని 50 ఇళ్ల ప్రజలకు న్యాయం చేయలేకపోతే తప్పుకోవాలని ప్రజాప్రతినిధులు వాలంటీర్లను హెచ్చరించారు. శనివారం చిప్పగిరి సచివాలయ కార్యాలయంలో సర్పంచి గోవిందరాజులు అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి బాలన్న ఆధ్వర్యంలో 'జగనన్న సురక్ష' నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో పాటు తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపిడిఒ సివి.కొండయ్య గ్రామ వాలంటీర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, వైసిపి కన్వీనర్‌ ఏరూరు రంగస్వామి, సర్పంచి గోవిందరాజులు మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వాలంటీరుకూ 50 గృహాలను కేటాయించారని తెలిపారు. వారికి ప్రభుత్వం నుంచి ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు వాలంటీర్లు ఉన్నారని చెప్పారు. వాలంటీర్ల పరిధిలోని వారికే సరైన న్యాయం చేయలేకపోతే మీరుండి లాభం లేనప్పుడు తప్పుకోవడం మంచిదని సూచించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జగనన్న సురక్ష'ను వాలంటీర్లు తేలికగా తీసుకుంటున్నారని మండిపడ్డారు. పనులు చేయలేని వాలంటీర్లకు తక్షణమే నోటీసు అందజేసి తీసేయాలని అధికారులను కోరారు. మంజూరయిన ధ్రువీకరణ పత్రాలను గుమ్మనూరు నారాయణ, సర్పంచి గోవిందరాజులు చేతులమీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఇఒఆర్‌డి సంజన్న, విఆర్‌ఒ తిమ్మప్ప పాల్గొన్నారు.