ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాశ్‌నగర్‌లో వైఎస్‌ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తూ పని ఒత్తిడితో మరణించిన ఆశావర్కర్ రేపూడి కృపమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని శనివారం సిఐటియు ఆధ్వర్యాన ఆశా వర్కర్లు డిఎంహెచ్‌ఒ జగన్నాథరావుకు వినతి అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, ఆశావర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శివాని, నాయకులు త్రివేణి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేరుతో ఆశా వర్కర్లకు నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారని, దీని మూలంగానే చిత్తూరు జిల్లాలో జానకి అనే ఆశా వర్కర్ నాలుగు రోజుల క్రితం మృతిచెందారని, ఇప్పుడు గుంటూరు జిల్లా తాడేపల్లిలో కృపమ్మ మరణించారని తెలిపారు. ఈ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి ఇరువురు ప్రాణాలు కోల్పోయారని, వీరి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు న్యాయం కోరుతున్న గొంతులను నొక్కి ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి శనివారం ఉదయానికి కృపమ్మ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో ప్రకటన వస్తుందని నమ్మబలికిన అధికారులు.. అందుకు విరుద్ధంగా నాయకులను, ఆశా కార్యకర్తలను మరోసారి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం మధ్యాహ్నం చనిపోయిన కృపమ్మ భౌతిక కాయాన్ని ఇంతవరకు కుటుంబ సభ్యులకు అందించలేదన్నారు. శవం ఎక్కడుందో కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యలను జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఖండించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు బంకురు సూరిబాబు, ఆశావర్కర్స్ యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, అరుణ, కృష్ణవేణి, పద్మ, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు గాంధీ పాల్గొన్నారు.
కొమరాడ : విధి నిర్వహణలో మరణించిన ఆశా వర్కర్ కృపమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్ చేశారు. కొమరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్న హెచ్‌వి నిర్మలకుమారికి శనివారం సిఐటియు ఆధ్వర్యాన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు ఆర్.రాజేశ్వరి, దుర్గ, సుజాత పాల్గొన్నారు.
సాలూరురూరల్ : జగనన్న సురక్ష పని ఒత్తిడితో మరణించిన ఆశా కార్యకర్త కృపమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తోణాం పిహెచ్‌సి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశావర్కర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పథకం అమలు చేయడానికి ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తుందని తెలిపారు. ఇటువంటి విధానం వల్ల మానసిక ఒత్తిడికి గురై ఉద్యోగులు మరణిస్తున్నారని తెలిపారు. అటువంటి వారి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే స్పందించి అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ కృపమ్మ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని, 50 లక్షల రూపాయలు నష్ట పరిహారం అందజేయాలని కోరారు. అనంతరం పిహెచ్‌సి వైద్యాధికారి సుజాతకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు చుక్క జ్యోతి, చొదిపిల్లి జొంజమ్మా, గిరిజన సంఘం మండల నాయకులు జన్నీ ఈశ్వర రావు పాల్గొన్నారు.










