Oct 07,2023 21:03

క్రీడా సామగ్రిని పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-పార్వతీపురం : ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నవంబరు 15 నుండి డిసెంబరు 21వ తేదీ వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన నమూనా క్రీడా సామగ్రిని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. ఫిట్‌ ఆంధ్రా ధ్యేయంతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయం స్థాయి నుండి మండల, నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గ్రామం, ప్రాంతంలోని స్థానిక క్రీడలతో సహా మూడు కిలో మీటర్ల మారథాన్‌, యోగా, టెన్నికాయిట్‌ వంటి క్రీడలు ముఖ్యంగా క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, వాలీ బాల్‌, కబడ్డీ, ఖోఖో క్రీడలను పురుషులు, మహిళలకు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా గ్రామాలకు చెందిన అభ్యర్థులు క్రీడలలో పాల్గొనవచ్చన్నారు. గుర్తింపు కార్డుగా ఆధార్‌ లేదా ఇతర గుర్తింపు కార్డు చూపించాలని తెలిపారు. క్రీడలలో పాల్గొనే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, క్రీడల చీఫ్‌ కోచ్‌ ఎస్‌.వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.