ప్రజాశక్తి కలక్టరేట్ (కృష్ణా) : పిల్లల ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే నులిపురుగుల నివారణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించు కొని చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగులు సోకిన పిల్లలు, కిశోర బాలలు వివిధ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని, వాటిలో ప్రధానంగా రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడుతుందని, ఫలితంగా నీరసంతో పాటు శారీరక, మానసిక ఎదుగుదల లోపిస్తుందని అన్నారు. ఈ విధమైన సమస్యలను అధిగమించడానికి పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వారిచేత మింగించాలని అధికారులకు సూచించారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యవేక్షించాలన్నారు. ఒకటి నుంచి ఐదు ఏళ్ల పిల్లలకు అంగన్వాడి కేంద్రాలు, ఆరు నుంచి 19 ఏళ్ల కిశోర బాలలకు పాఠశాలలు, కళాశాలలో మాత్రలు తప్పనిసరిగా పంపిణీ చేయాలని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జీ. గీతాబాయి, జిల్లా విద్యాశాఖ అధికారిణి తాహెర సుల్తానా, ఉప విద్యాశాఖ అధికారి సుబ్బారావు, 9వ డివిజన్ కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ, ప్రధానోపా ధ్యాయులు కష్ణమూర్తి, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










