Aug 12,2023 22:49

ప్రజాశక్తి-బంటుమిల్లి : జూలై నెలాఖరులో కురిసిన అతి భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు 13 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం కష్ణా జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బంటుమిల్లిలో శనివారం ఆయన మాట్లాడుతూ బంటుమిల్లి , కత్తివెన్ను, పెడన, గూడూరు గుడివాడ ,గన్నవరం, పెనమలూరు తదితర మండలాల్లో వరి పొలాలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో 2020 సంవత్సరంలో ఏప్రిల్‌ నెలలో కురిసిన అకాల భారీ వర్షాలకు , వడగండ్లవనకు కత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో దాదాపు 4520 మంది రైతులకు సుమారు మూడు కోట్లు ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ సంఘం బంటుమిల్లి మండల కార్యదర్శి లంకదాసుల అజరు ఘోష్‌, సమ్మెట నాంచారయ్య దూసనపూడి పరంధామయ్య ,దూసనపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.