ప్రజాశక్తి బత్తలపల్లి : వర్షాలు, వడగండ్లు ఈదురు గాలులకు దెబ్బతిన్న పండ్లతోటల నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధిత రైతులకు పంట నష్టపరిహారం అందేలా చూస్తామని జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ అవుటాల రమణారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖాధికారి చంద్రశేఖర్ బాధిత రైతులకు హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం,ఈదురుగాలులకు పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారులు మంగళవారం మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, గోవిందరెడ్డి 10 ఎకరాలలో సాగు చేసి నష్టపోయిన అరటిపంటను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులతో వారు మాట్లాడుతూ దిగుబడి చేతికి దక్కే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నోటికి అందకుండా పోయిందని అనానరు. ప్రభుత్వం నుండి ఆదుకునే చర్యలు చేపడతామని వారు హామీ ఇచ్చారు.ఉద్యాన శాఖ అధికారులు పంటనష్టాలను అంచనా వేసి ఉన్నతాధికారులకు పంపుతారని తాము ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పంట నష్టం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఇ ఓబిరెడ్డి, ఆర్‌బికె విఎఎ నిఖిత, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.










