బత్తలపల్లి : ఈదురు గాలులు,భారీ వర్షానికి పంట నష్టపోయిన పండ్లతోటల రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆసంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ను జిల్లాకేంద్రంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జెవి. రమణ మాట్లాడుతూ అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల 32 మండలాలలోని మామిడి, అరటి, చీని, తదితర పండ్ల తోటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. అధికారులు గ్రామీణ ప్రాంతాలలోని అన్ని పంటలను పరిశీలించి వెంటనే నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కమతం కాటమయ్య, ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి గోవిందరెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు బండల వెంకటేష్, రైతులు వెంకటేశ్, రామాంజనేయులు, లక్ష్మీనారాయణ ,శ్రీరాములు, సుబ్బరాయుడు ,అనిల్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.










