న్యూఢిల్లీ: దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా జరుగుతోన్న ట్రయల్స్‌లో ప్రముఖ టెలికాం పరికరాల తయారీ సంస్థ నోకియా ఇండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌పై జరిపిన ప్రయోగ పరీక్షల్లో సెకనుకు 9.85 గిగాబిట్ (జీబీపీఎస్) వేగంతో బ్యాక్ ఎండ్‌లో డేటా బదిలీ అయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ బ్యాండ్ స్పెక్ట్రమ్‌లో ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపింది.
దేశంలో 5జీ ట్రయల్స్‌కు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం శాఖ (డాట్) మే నెలలో అనుమతులను ఇచ్చింది. ఆరు నెలల పాటు ఆయా టెలికాం సంస్థలు ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వొడాఫోన్‌కు సంప్రదాయ 3.5 జిహెచ్‌జడ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌తో పాటు 26 గిగాహెర్జ్ట్ జిహెచ్‌జడ్ ,హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను డాట్ కేటాయించింది. వొడాఫోన్ ఐడియా సాయంతో ఈ-బ్యాండ్‌తో ఇంత వేగాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని కంపెనీ తెలిపింది. ఫైబర్‌తో సమానమైన వేగాన్ని అందుకోగలిగామని పేర్కొంది. దీంతో ఫైబర్‌ను వేయలేని ప్రాంతంలో కూడా 5జీ సేవల్ని అందించగలమని తెలిపింది.










