ప్రజాశక్తి - నందవరం
వర్షాల్లేక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం నందవరం మండలాన్ని కరువుగా ప్రకటించాలని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు, నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌ఛార్జీ మాధవరావు దేశాయి కోరారు. సోమవారం నందవరంలో రైతులతో కలిసి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాత్రి, పగలు అని తేడా లేకుండా వ్యవసాయాన్ని నమ్ముకొని పంటలు సాగు చేసిన రైతులకు వర్షాల్లేక కన్నీళ్లే మిగిలాయని తెలిపారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెబుతున్న వైసిపి హయాంలో మంత్రి, ఎమ్మెల్యేలు కనీసం పంటలను పరిశీలించిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. చంద్రబాబు బాబు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు రావన్న జగన్‌కు మరి ఇప్పుడు వర్షాల్లేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. అన్నింటికీ బటన్ నొక్కుతున్న ముఖ్యమంత్రి జగన్ వర్షాన్ని కూడా బటన్ నొక్కి రప్పించాలని కోరారు. ఇప్పటికే ఒక్కో రైతు అప్పులు తెచ్చి ఎకరాకు రూ.15 వేలు ఖర్చు చేశారని తెలిపారు. ఎద్దుల బాడుగ, కూలి ఖర్చులు కలిపితే రూ.20 వేలు ఖర్చు చేశారని చెప్పారు. వెంటనే కరువు మండలంగా ప్రకటించి, నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం అందించాలని కోరారు. పంట రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలిచ్చి, రబీ సాగుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో సబ్సిడీ కింద రైతులకు విత్తనాలు, పని ముట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. టిడిపి కార్యకర్తలు మల్లికార్జున, వెంకటేష్, శ్రీనివాసులు, చాంద్, వలీ, గొల్ల వెంకటేష్, పంపయ్య, కొత్తపల్లి వీరేష్ గౌడ్, నరసింహులు, ముత్తరాజు, అంజి, ఆనంద్, వడిగిరి నరసింహులు పాల్గొన్నారు.
కాయలు లేని పత్తి మొక్కను చూపిస్తున్న మాధవ రావు దేశాయి










