ప్రజాశక్తి-పాడేరు టౌన్: కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సిపిఎస్)ను రద్దు చేసి ఇచ్చిన హామీ మేరకు పాత పింఛను పథకం (ఒపిఎస్)ను అమలు చేయకుండా ఉద్యోగులను నిలువునా మోసం చేశారని ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్.జగన్ మోహన్ రావు, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి, సిపిఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.ఈశ్వరరావు అన్నారు. శనివారం అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఫ్యాపో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 2004 నుంచి అమలు అవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దుపైన ముఖ్యమంత్రి మాట తప్పి కేబినెట్ సమావేశంలో గ్యారెంటీ పింఛను పథకం (జిపిఎస్) ను ఆమోదింపజేయడం 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లను మోసం చేయటమే అని విమర్శించారు. కేబినెట్ సమావేశంలో సిపిఎస్ ను రద్దు చేస్తూ జిపిఎస్ ను ఆమోదిస్తున్నట్టు తీర్మాణం చేయటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.










