నకిలీ విత్తనాలను అరికట్టాలి
- దాడులు ముమ్మరం చేయండి : కలెక్టర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
ఖరీఫ్ సీజన్‌లో రైతులు నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా విత్తన విక్రయ దుకాణాలపై దాడులు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ మనజిర్ జిలాని సమూన్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నకిలీ విత్తనాల కట్టడిపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతిలతో కలిసి వ్యవసాయ అధికారులు, డిఎస్పీలు, తహశీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో వ్యవసాయ అధికారి, పోలీసు, రెవెన్యూ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసుకొని నకిలీ విత్తన విక్రయ కేంద్రాలపై ముమ్మరంగా దాడులు నిర్వహించి సీడ్ యాక్ట్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలపై ఫిర్యాదులు ఈ ఏడాది పునరావతం కాకుండా సంబంధిత మండల బృందాలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఏ ఒక్క ఫిర్యాదు వచ్చినా సంబందిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. ప్రధానంగా పత్తి, మిరప విత్తనాల్లో నకిలీ వస్తున్నాయని, సంబంధిత నకిలీ విత్తనాలు విక్రయించినట్లు వెల్లడైతే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రసాయన ఎరువులు, పురుగు మందులు ఎమ్మార్పీ ధరల కన్నా మించి విక్రయిస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి చట్టప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేసి వాస్తవ నివేదికలను అందజేయాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నకిలీ విత్తనాల విక్రయాన్ని అరికట్టేందుకు ఎస్‌ఒపి ప్రకారం పకడ్బందీగా అమలు పరచేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను సూచించారు. జిల్లాలోని విత్తన విక్రయ కేంద్రాలు, ఎరువుల దుకాణాల జాబితాలను తమకు అందజేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. సమావేశంలో అన్ని మండలాల వ్యవసాయ శాఖ ఏడిలు, మండల వ్యవసాయ అధికారులు, డీఎస్పీలు, తహశీల్దారులు పాల్గొన్నారు.










