Jun 08,2023 20:22

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ రఘువీర్‌ రెడ్డి

నకిలీ పత్రాల తయారీ ముఠా అరెస్టు
జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     గ్రామ మాప్‌లో లేని వ్యవసాయ భూమికి నకిలీ పత్రాలు, పాస్‌ పుస్తకాలు, ఎలక్ట్రానిక్‌ పత్రాలు సృష్టించి, వాటితో బ్యాంక్‌ లోన్‌, ప్రభుత్వ పథకాలు పొంది, అమాయకులైన మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసే ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి అడిషనల్‌ ఎస్పీ వెంకట రాముడు, ఆళ్లగడ్డ డిఎస్పీ బి.వెంకటరామయ్యతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్‌పి నిందితులను వివరాలు తెలియజేశారు. డాలు అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తి చాగలమర్రి తహశీల్దార్‌ కార్యాలయంలోని రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై సత్తివీడు గ్రామ పరిధిలో సర్వే నంబర్‌ 3-1ఏను కొత్తగా పత్రాలను సృష్టించాడన్నారు. ఈ సర్వే నంబర్‌లో ఏడు మందికి ఆన్‌లైన్‌లో పొందుపరిచి ఆ డాక్యుమెంట్లను తీసుకొని వివిధ బ్యాంకులలో, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా వంటి రైతు రుణాన్ని లూటీ చేశారన్నారు. డాలు నరసింహులు సుమారు 4.12 సెంట్ల భూమిని ఆలమూరు గ్రామస్తుడైన దేవదాసుకు అమ్మాడని, ఇంకొక రైతు పుష్పరాజ్‌ సుమారు 4.18 సెంట్లు భూమిని పది లక్షల రూపాయల బాకీకి గాను సదరు భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పోతురాజు దేవరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా శెట్టివీడు గ్రామ పరిధి మ్యాప్‌లో లేని కొత్త సర్వే నెంబర్‌ 3-1ఎ సృష్టించి, అందులో ఏడుగురి పేరు మీద సుమారు 29 ఎకరాల లేని భూమిని రూ.40 వేలు తీసుకొని ఆన్లైన్‌ చేయించిన అప్పటి శెట్టివీడు గ్రామ విఆర్‌ఒ కలమల్ల హుస్సేన్‌ సాబ్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ తలారి తిప్పనపల్లె మధులు డాలు అరుణ్‌ కుమార్‌ వద్ద రూ. 30 వేలు తీసుకొని వాటిని డిజిటల్‌ సంతకం చేయించిన విఆర్‌ఒ హరి హరనాథ్‌ రావు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ రాము రూ.18 వేలు తీసుకొని పాస్‌ బుక్‌లు ఇచ్చిన తలారి శ్రీనివాస రావును, దీనంతటికి సహకరించిన అప్పటి ముత్యాలపాడుకు చెందిన దావీదు, తలారి ప్రతాప్‌లను ఈ నెల 7న ముత్యాలపాడు బస్‌ స్టాండ్‌ వద్ద అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే గురువారం అప్పటి మండల తహశీల్దార్‌ మాలకొండయ్యను ఆళ్లగడ్డ టౌన్‌లోని మహాలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌ వద్ద అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఎవరైనా నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించినా, మరొకరికి తప్పుడు రిజిస్ట్రేషన్లతో ప్రజలను మోసం చేసినా అలాంటి వారిని ఉపేక్షించేదే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆళ్లగడ్డ రూరల్‌ సిఐ ఎన్‌.రాజశేఖర్‌ రెడ్డి, చాగలమర్రి ఎస్‌ఐ టి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.