ప్రజాశక్తి కదిరి టౌన్ : కదిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రెవెన్యూ శాఖలో ఇన్‌ఛార్జుల పాలన చాలా కాలంగా కొనసాగుతోంది. ఆయా మండలాల్లో రెగ్యులర్ తహశీల్దార్లు లేకపోవటంతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో పలు సమస్యలతో కార్యాలయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని సత్వరమే వారి సమస్యలు పరిష్కరించాలని స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావటంలేదు. కదిరి నియోజవర్గంలో రెవెన్యూ సేవలు మందగిస్తున్నాయి. మండలాల్లో ప్రజలకు సకాలంలో ధ్రువీకరణ పత్రాలు అందడం లేదు. భూ సర్వేలు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, అడంగల్ నమోదు, వన్ బి లో మార్పులు చేర్పులు వంటి పనుల్లో తీవ్ర జాప్యం కనిపిస్తోంది. జనం పెట్టుకున్న అర్జీలు నెలల తరబడి పరిష్కారానికి నోచుకోవటం లేదు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న ఫైళ్లకు వారాల తరబడి మోక్షం లభించడం లేదు. మండల కేంద్రాల్లో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగలేక జనం అల్లాడిపోతున్నారు. నూతన జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
కదిరిలో... కదిరికి 18 నెలలుగా రెగ్యులర్ తహశీల్దార్ లేకపోవడంతో ఇన్‌ఛార్జుల పాలన కొనసాగుతోంది. ఇక్కడ ఇన్‌ఛార్జి తహశీల్దార్‌గా ఉన్న ముకుంద రాజకీయ ఒత్తిళ్లతో దీర్ఘకాలిక సెలవులో వెళ్ళినట్లు సమాచారం. ప్రస్తుతం బుక్కపట్నం తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న నటరాజకు కదిరి ఇన్‌ఛార్జి తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. వివిధ రకాల సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రజలు అధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకులో రుణాల రెన్యువల్‌కు వన్‌బి లో మార్పులు చేర్పులు కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సకాలంలో పనులు కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కొత్త పాసుబుక్కులకు దరఖాస్తు చేసుకున్న రైతులు వాటి కోసం ఎదురు చూడక తప్పలేదు. విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు కోసం కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. కదిరి పెద్ద మండలం కావడంతో ఇక్కడ రెగ్యులర్ తహశీల్దార్‌ను నియమించి సమస్యలు పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
నల్లచెరువు, తనకల్లులో ఇదే పరిస్థితి.. నల్లచెరువు, తనకల్లు మండలాల్లో రెగ్యులర్ తహశీల్దార్ లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తనకల్లులో డిప్యూటీ తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న మధు తనకల్ ఇన్‌ఛార్జి తహశీల్దార్‌గా ఉంటూ, నల్లచెరువు తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆయా మండలాల ప్రజలు పెట్టుకున్న అర్జీలకు నెలలు తరబడి పరిష్కారం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాండ్లపెంటలో ఇన్‌ఛార్జి పాలన.. గాండ్లపెంట డీటీగా విధులు నిర్వహిస్తున్న రవి ఇన్‌ఛార్జి తహశీల్దార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ తహశీల్దార్ లేకపోవడంతో మండల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.
ఎన్ పి కుంటలో డీటీనే దిక్కు.. జిల్లా సరిహద్దు ప్రాంతమైన నంబుల పూలకుంట మండలంలో తహశీల్దార్ లేకపోవడంతో డీటీగా విధులు నిర్వహిస్తున్న రవినాయక్ ఇన్‌ఛార్జి తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కాక ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.
తలుపులలో మూడేళ్లుగా తహశీల్దార్ పోస్ట్ ఖాళీ.. తలుపుల మండలంలో మూడేళ్లుగా తహశీల్దార్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో ఆ మండల ప్రజల పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వివిధ పనులు నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ పనులు కాక విసిగెత్తిపోతున్నారు. వారు అర్జీల రూపంలో పెట్టుకున్న సమస్యలు పరిష్కారం కాక అవస్థలు పడుతున్నారు. రెగ్యులర్ తహశీల్దార్‌ణు నియమించాలని పలుమార్లు మండల ప్రజలు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీటీగా విధులు నిర్వహిస్తున్న మునిస్వామి ఇన్‌ఛార్జి తహశీల్దార్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
కలెక్టర్ స్పందించాలి.. కదిరి నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో రెగ్యుల్ తహశీల్దార్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జిల్లా నూతన కలెక్టర్ అరుణ్ బాబు స్పందించాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. వెంటనే స్పందించి ఆయా మండలాలకు రెగ్యులర్ తహశీల్దార్లను నియమించాలని కోరుతున్నారు.










