పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం వరకు చేపట్టిన జాతీయ రహదారికి భూములు, ఇల్లు కోల్పోతున్న బాధితులకు న్యాయపరమైన నష్టపరిహారం అందించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం బుక్కపట్నం మండలం బుచ్చయ్య గారి పల్లి, చండ్రాయుని పల్లికి చెందిన రైతులు, గృహాలు కోల్పోతున్న బాధితులతో కలసి జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ జాతీయ రహదారికి బుచ్చయ్య గారి పల్లిలో 58 గృహాలు కోల్పోతున్నారన్నారు. వారందరికీ 2013 భూ సేకరణ చట్ట ప్రకారం తగిన ధరను చెల్లించాలన్నారు. పునరావాస చట్టం కింద వారికి ఇళ్ల స్థలాలు చూపించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలన్నారు. ప్రస్తుత ధరల మేరకు విలువ కట్టి న్యాయమైన పరిహారం అందించాలన్నారు. బాధితుల అనుమతి మేరకే నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఈ రహదారి కోసం విలువైన పండ్ల తోటలు కోల్పోవాల్సి వస్తోందన్నారు. ఆ రైతులందరి అనుమతి తర్వాతనే తగిన ధర చెల్లించాలన్నారు. గృహాలు కోల్పోతున్న స్థలాలు రహదారి పక్కనే ఉన్నందున సెంటు ధర రూ. 5 లక్షలు పలుకుతోందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సరైన నష్టపరిహారం అందించాలన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్ మాట్లాడుతూ, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బుక్కపట్నం మండల టిడిపి కన్వీనర్ మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, శివ, జయరాం, సురేంద్రబాబు, అంబులెన్స్ రమేష్, పలువురు బాధితులు పాల్గొన్నారు.










