Sep 03,2023 19:52

సదస్సులో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు

పార్వతీపురం : మోడీజీ ఉద్యోగాలెక్కడ... దేశ భవితవ్యం ఎవరిది... నిరుద్యోగంతో దేశాభివృద్ధి సాధ్యమా అని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ, రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఆదివారాన్ని నిరుద్యోగ దినంగా పాటిస్తూ స్థానిక సుందరయ్య భవనంలో నిరుద్యోగులతో సదస్సు నిర్వహించారు. యువజన సంఘం జిల్లా కన్వీనర్‌ ఎం.వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సదస్సులో రెడ్డి వేణు మాట్లాడుతూ దేశ జనాభాలో 35ఏళ్లలోపు యువత 65 శాతం ఉన్నారని, వీరికి ఉద్యోగం, ఉపాధి కరువై నిరుద్యోగులుగా రోడ్లపై తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డిగ్రీ, పీజీలు చదివిన వారు కూలిపనులకు వెళ్తున్నారన్నారు. మోడీ 2014 ఎన్నికల సందర్భంగా సంత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కారని తెలిపారు. 2017- 18లో నాలుగు శాతంగా ఉన్న నిరుద్యోగం 2022లో ఏడు శాతానికి పైగా పెరిగిందన్నారు. ఈ నాలుగేళ్లలో కోటీ 50 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీలకు, పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పూర్తిస్థాయిలో అమలు చేసేలా పోరాడాలని పిలుపునిచ్చారు. మతోన్మాద మోడీ ప్రభుత్వానికి ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు తప్పదేశ ప్రజల కష్టాలు పట్టడం లేదని మండిపడ్డారు. జిల్లాలో జ్యూట్‌, సుగర్‌, ఫెర్రోఎల్లాయిస్‌ ఫ్యాక్టరీల మూతవల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్త ం చేశారు. సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మూతకి మోడీ సిద్ధంగా ఉందని, వాటికి మన రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన వత్తాసుపలకడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. దళిత, గిరిజన బ్యాక్‌లాగ్‌ పోస్టులు లక్షల సంఖ్యలో ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. మోడీ సర్కార్‌ లేబర్‌ కోడ్లు తెచ్చి కార్పొరేట్లకు రక్షణగా నిలుస్తుందని, ఇది చాలా దుర్మార్గమని మండిపడ్డారు. పాలకులు యువతలో అసంతృప్తిని మతోన్మాదం వైపు మళ్లించి దేశ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. కావున ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, గిరిజన యువతకు స్పెషల్‌ డిఎస్సి నిర్వహించాలని, పట్టణంలో ఉపాధి హామీ చట్టం అమలు చేయాలని సదస్సులో వక్తలు డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై సోమవారం జిల్లాలోని తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలో పాల్గొవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి.రాజశేఖర్‌, డి.పండు, ఎస్‌.భాస్కరరావు, అన్నాజీ, రమేష్‌, మహేష్‌, బి.సూరిబాబు, యువత తదితరులు పాల్గొన్నారు.